జగనన్న విద్యా దీవెన(జేవీడీ) ద్వారా జిల్లాలో 96, 112 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని కలెక్టర్ వివేక్‌యాదవ్ పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ జేవీడీ త్రైమాసిక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా నాయకులు, అధికారులు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని విద్యార్థులకు రూ. 74. 94 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నేరుగా వారి తల్లుల ఖాతాలోనే జమ చేశామన్నారు.
దీంతో పాటు వసతి దీవెన కూడా అమలు చేయడం జరుగుతుందన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు పౌష్టికాహారం కోసం జగనన్న గోరుముద్ద పథకం ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తోన్నామన్నారు. జడ్పీ చైర్‌పర్సన్ హెనీ క్రిస్టినా మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబంలోని పిల్లలను ఉన్నత చదువులు చదివించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జేసీ(ఆసర) కె. శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పురుషోత్తం, కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్‌పర్సన్ కోల భవాని, ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్‌రావు, డిప్యూటీ మేయర్ సజీల, డీఆర్‌వో కొండయ్య, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు మధుసూదనరావు, కలెక్టరేట్ ఏవో తాతా మోహన్‌రావు, విద్యార్థుల, తల్లిదండ్రులు పాల్గొన్నారు.