ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యావిధానంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. కర్నూలు నగరంలోని స్థానిక కలెక్టర్ బయటకు వచ్చి తమతో మాట్లాడాలని డిమాండ్ చేశారు.
గేటు ఎక్కి లోపలకు వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకుని విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేశారు. మిగతా వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. కాసేపటి తర్వాత అరెస్టు చేసిన వారిని విడిచిపెట్టారు.
ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేష్, అబ్దుల్లా మాట్లాడుతూ. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని చలో కలెక్టరేట్‌కు పిలుపునిచ్చామన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన వర్తించకుండా తీసుకువచ్చిన జీవో నెం: 77ను, నూతన విద్యా విధానంలో భాగంగా చదువుకు దూరం చేసేలా 3, 4, 5 ప్రాథమిక తరగతులను హైస్కూల్‌లో విలీనం చేయడాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
నూతన విద్యా విధానం అమలు ఆపాలని, సంక్షేమ హాస్టళ్లకు నాడు-నేడు కింద నూతన భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఖర్చులకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.