ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాలుగు దశాబ్దాల ‘శంకరాభరణం’

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 02, 2020, 08:00 PM

తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రం 'శంకరాభరణం'. కొన్ని సినిమాలు చూసి థియేటర్ నుండి బయటకు రాగానే మర్చిపోతాం. మరికొన్ని సినిమాలు థియేటర్ నుండి బయటకు వచ్చినా ఆ సినిమాలోని సన్నివేశాలు ఇంకా కళ్ళముందే కదులుతుంటాయి.. ఏదో తెలియని ఒక అనుభూతిని ఆ సినిమా నుండి మనం పొందుతాం. సినీ అభిమానులని అలాంటి అనుభూతికి లోను చేసిన సినిమాలలో ముందు వరుసలో నిలిచే సినిమా 'శంకరాభరణం'. 1980 ఫిబ్రవరి 2న విడుదలైన ఈ చిత్రం 2020 ఫిబ్రవరి 2నాటికి 40 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఓసారి ఈ అద్భుత కళాఖండాన్ని గురించిన విషయాలను తెలుసుకుందాం.
తెలుగు సినిమా అంటే నాలుగు పాటలు.. రెండు సెంటిమెంట్ సీన్లు..అర్థంపర్థం లేని పాత్రల సమ్మేళనం అని కొంతమంది అనుకునేవాళ్లు. కానీ సినిమాలో ప్రతి సీన్ కి.. ప్రతి మాటకు అర్థాన్ని తెలుపుతూ తెలుగు సినిమాలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది మాత్రం దర్శకుడు కళాతపస్వి పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్. (భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన మరిన్ని సినిమాలు తీసారు. వాటిలో కొన్ని 'సాగరసంగమం', 'శృతిలయలు', 'సిరివెన్నెల', 'స్వర్ణకమలం', 'స్వాతికిరణం' మొదలైనవి.) సంగీత ప్రధానంగా తెరకెక్కిన సినిమా శంకరాభరణం. శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువైన రోజుల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా చూసిన తర్వాత ఎంతోమంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టారంటే ఈ సినిమా వారిపై ఎంత ప్రభావం చూపించిందో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు చాగంటి కోటేశ్వర రావు ఈ సినిమాపైనే మూడు రోజులు ప్రవచనాలు చేశారంటే ఈ సినిమా విశిష్టత మనం ఎలాంటిదో అర్థంచేసుకోవచ్చు.


విశ్వనాథ్ సినిమాలలో సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సినిమాకి కె.వి. మహదేవన్ సంగీతం ప్రాణంగా నిలిచింది. "దొరకునా ఇటువంటి సేవ"... "శంకరా నాదశరీరాపరా".. "ఏ తీరుగ నను దయ చూచెదవో"... లాంటి పాటలు నేటికీ ఆణిముత్యాలే. ఈ సినిమాకు కె.వి. మహదేవన్ అందించిన సంగీతంతో ఆయనకు విపరీతమైన అభిమానులు ఏర్పడ్డారు. ఈ సినిమాలో 10 పాటలు వున్నాయి. సంగీతంతో పాటు విశ్వనాథ్ సినిమాలలో మాటలు మనసుకు హత్తుకుపోతాయి. 'పాశ్చాత్య సంగీత పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక్క కాపు కాయడానికి తన చేతులడ్డు పెట్టిన ఆ మహానుభావులెవరో వారికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను' అని ఈ సినిమాలో చెప్పిన డైలాగులు తెలుగు భాష వున్నంతవరకు గుర్తుంటాయి.


అవార్డులు : ఇక ఈ సినిమాకు అవార్డుల విషయానికి వస్తే, జాతీయ అవార్డుల్లో కళాత్మక విలువలు, వినోదాత్మకంతో కూడిన జనరంజక చిత్రంగా స్వర్ణకమలం అందుకుంది. తెలుగులో స్వర్ణకమలం అందుకున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. అలాగే గాయకులు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ నేపథ్య గాయకుడిగా తొలిసారి జాతీయ అవార్డు, శ్రీమతి వాణి జయరాంకు ఉత్తమ గాయకురాలిగా, కె.వి.మహదేవన్‌కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు లభించిన సినిమా ఇది. అలాగే ఆంధ్ర‌ప్రదేశ్ నంది అవార్డులతోపాటు, దేశంలోని అనేక సాంస్కృతిక సంస్థలు ఈ చిత్ర బృందాన్ని అవార్డులు, సన్మానాలతో ముంచెత్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa