బాలీవుడ్ స్క్రీన్లు భారీ సినిమాలకు అలవాటుపడిపోయాయి. స్టార్స్ ఉన్న సినిమాలకు మాత్రమే అక్కడ థియేటర్లు దొరుకుతాయి. ఓ మాదిరి సినిమాలను అక్కడ ఎవరూ అంతగా పట్టించుకోరు. అలాంటిది ఇప్పుడు అక్కడ 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాకి థియేటర్లు దొరకడం లేదు .. టిక్కెట్లు దొరకడం లేదు. అనుపమ్ ఖేర్ .. మిథున్ చక్రవర్తి .. పల్లవి జోషి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించాడు. ఈ నెల 11వ తేదీన 630 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, వారం తిరిగేసరికి 4 వేల థియేటర్లలోకి ఎంటరైంది. 100 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. 1990లలో కశ్మీర్ పండిట్లపై జరిగిన అమానుషకాండకు అద్దం పట్టిన సినిమా ఇది. ఈ సినిమాతో ఇప్పుడు ఎక్కడ చూసినా వివేక్ అగ్నిహోత్రి పేరు మారుమ్రోగుతోంది. ఈ ఉత్సాహంతో ఆయన 'ది ఢిల్లీ ఫైల్స్' అనే సినిమాకి శ్రీకారం చుట్టినట్టుగా చెబుతున్నారు. ఢిల్లీ నేపథ్యంలో ఆయన ఏ అంశాన్ని ఆవిష్కరిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.