![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 17, 2025, 10:12 PM
ఆసియా ఖండంలోనే ఎక్కడా లేని విధంగా పురాతన, చారిత్రక ప్రాధాన్యత గల నిలువురాళ్ల సంపదను కృష్ణానదీ తీరంలో గుర్తించబడింది. పాలమూరు స్టోన్ హెంజ్‌గా పేరున్న నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే యునెస్కో దీనికి తాత్కాలిక గుర్తింపు ఇచ్చింది. బృహత్ శిలాయుగం కాలం నాటి ఖగోళ పరిశోధనా కేంద్రంగా విరాజిల్లినట్లు చెబుతున్న నిలువురాళ్లను చారిత్రక సంపదగా గుర్తించి పరిరక్షణ చర్యలు చేపట్టాలని ఏన్నో ఏళ్లుగా స్థానికులు కోరుతున్నారు. అదే జరిగితే దేశంలోనే ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో కృష్ణానదీ తీరంలో ఉన్న నిలువురాళ్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ నిలువురాళ్లకు 3 వేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ఇవి అరుదైన శిలలుగా గుర్తింపు పొందాయి. ఈ శిలలను పూర్వం ఖగోళ శాస్త్ర పరిశోధనా కేంద్రంగా వినియోగించినట్లు.. 1980లో విదేశీ పురాతత్వ శాస్త్రవేత్త ఆల్చీన్ మొదట ప్రకటించారు. దాదాపు 80 ఎకరాల్లో విస్తరించిన ఈ నిలువు రాళ్ల నీడలతో.. వాతావరణ మార్పులను అప్పటి జనం గుర్తించే వారని.. వీటినే కాలమాన పట్టిక గానూ వినియోగించే వారని పరిశోధకులు చెబుతున్నారు.
ఇంగ్లాండ్‌లోని విల్‌షైర్ ప్రాంతంలో స్టోన్ హెంజ్‌గా పేర్కొనే నిర్మాణాలను.. ఈ నిలువు రాళ్లు పోలి ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. స్టోన్‌హెంజ్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిందని.. అదే రీతిలో ఉన్న నిలువు రాళ్లను కూడా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని.. అందుకవసరమైన కార్యాచరణను ప్రభుత్వం చేపట్టాలనే డిమాండ్లు స్థానికంగా ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ప్రస్తుత నారాయణపేట జిల్లాలోని కర్ణాటక-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కృష్ణా మండలం ముడుమాల్ గ్రామంలో కృష్ణానది తీరం వెంబడి బృహత్ శిలా యుగానికి చెందిన చారిత్రక సంపదే ఈ నిలువురాళ్లు.
12 నుంచి 14 అడుగుల ఎత్తున్న గండ శిలలను ఇక్కడ క్రమ పద్ధతిలో పాతారు. దాదాపు 80 ఎకరాల్లో విస్తరించిన ఈ గండ శిలల ప్రాంతాన్ని బృహత్ శిలాయుగంలో ఖగోళశాస్త్ర పరిశోధనా కేంద్రంగా వినియోగించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ నిలువురాళ్లకు తోడు.. వాటి తరహాలోనే పాతిన దాదాపు మూడు వేల వరకు చిన్న చిన్న రాళ్లు ఇక్కడ ఉన్నాయి. భారీ శిలలతో ఒక వృత్తాకార నిర్మాణం కూడా గతంలో ఉండేది. కాలక్రమంలో రాళ్ల తొలగింపుతో ఆ నిర్మాణం చెదిరిపోయినట్లు తెలుస్తోంది. ఆసియా ఖండంలోనే ఇలాంటి నిలువురాళ్ల సంపద ఎక్కడా లేదని.. పురావస్తు శాఖ అధ్యయనం ద్వారా తెలుస్తోంది.
తెలంగాణకే ప్రత్యేకమైన ఒక చారిత్రక సంపదగా పరిరక్షణ చర్యలు చేపట్టి.. దాదాపు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిని రైతు నుంచి కొనుగోలు చేసి.. చుట్టూ కంచె కూడా ఏర్పాటు చేసింది. ఇంతటి అధ్బుతమైన నిలువురాళ్లు తమ ప్రాంతంలో ఉండటంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిలువు రాళ్లకు తాత్కాలికంగా యునెస్కో అవార్డు రావటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని కోరుతున్నారు. యునెస్కో శాశ్వత గుర్తింపు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.