![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 03:37 PM
బెట్టింగ్ యాప్స్.. తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న వ్యవహారం. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే.సోషల్ మీడియా వేదికలు అయిన యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో తాము పెట్టే వీడియోలలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు. తాము ఫలానా బెట్టింగ్ యాప్ ద్వారా డబ్బులు సంపాదించినట్లు కూడా డెమో వీడియోలను పెడుతున్నారు. ఈ సో కాల్డ్ ఇన్ ఫ్లూయెన్సర్లు చెప్పేదంతా నిజమనే భావనలో ఉన్న కొందరు సదరు బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి పోగొట్టుకుంటున్నారు. మొదట్లో తక్కువ మొత్తంతో మొదలై ఆ తర్వాత లక్షలకు చేరుకుంటుంది. చివరకు అప్పుల పాలై ఆత్మహత్యల వరకు వెళ్తుంది. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసేవారేమో లక్షలకు లక్షలు సంపాదిస్తుంటే.. దాన్ని ఉపయోగించే వారు మాత్రం డబ్బులు పోగొట్టుకుని చావును వెతుక్కుంటున్నారు.
ఈ బెట్టింగ్ యాప్స్ లపై ఐపీఎస్ వీసీ సజ్జనార్ గుర్రుగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్స్ పై విరుచుకుపడుతూ.. ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక వీడియోకు పెట్టిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ట్రావెల్ వ్లాగ్స్ చేసే బయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తుంటాడు. ఈ వీడియోలో అతడు.. అర్జెంటీనా, బ్రెజిల్ లో ట్రావెల్ వ్లాగ్స్ చేసినా అనుకున్నంత రీచ్ రాలేదన్నాడు. బ్రెజిల్ లో తన బైక్ కు యాక్సిడెంట్ కాగా.. దాని ఖర్చు రూ. 4 లక్షలు అయ్యిందన్నాడు. అయితే యూట్యూబ్ నుంచి తనకు కేవలం రూ. 2 లక్షలు మాత్రమే వచ్చిందన్నాడు. దాంతో బైక్ కూడా రిపేర్ చేసుకోలేని దాంతో తాను బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపాడు. ఈ వీడియోకు సజ్జనార్ తనదైన శైలిలో కౌంటర్ వేశాడు.'చూశారా.. వీళ్ళు మనుగడ సాగించేందుకు వేరే ఆప్షన్ లేదంట. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడమే ఒక్కటే మార్గమట. మీ జీవితాలను బాగు చేసుకునేందుకు ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేయడం ఎంత వరకు కరెక్ట్. ఎందరో బెట్టింగ్ కు బానిసలై ఆత్మహత్యలు చేసుకోవడం మీకు కనిపించడం లేదా.. కండ్లుడి కూడా చూడలేకపోతున్నారా!? యూట్యూబ్ లో వ్యూస్ తగ్గి డబ్బులు రాకపోతే ఫాలోవర్స్ ని మోసం చేస్తారా!? వీళ్లకు వ్యూస్ ద్వారా వచ్చే డబ్బే ముఖ్యం. డబ్బు కోసం ఏమైనా చేస్తారు.. అందుకే అభిమానంతో ఫాలో అవుతున్న ఎంతో మందిని బెట్టింగ్ కు బానిసలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.' అంటూ సజ్జనార్ కామెంట్ పెట్టాడు.