![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 04:50 PM
హైడ్రా పేరుతో ప్రభుత్వంలోని పెద్దలు వసూళ్ల దందా నడిపిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ పేరుతో పేదల ఇళ్లపై పగబట్టారని ఆరోపించారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరును విమర్శిస్తూ పోస్టు పెట్టారు. ఫోర్త్ సిటీ పేరుతో ముఖ్యమంత్రి ఫ్యామిలీ రియల్ వ్యాపారం చేస్తోందని మాజీ మంత్రి దుయ్యబట్టారు. ట్రిపుల్ ఆర్ పేరుతో పేదల భూముల ఆక్రమణకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. పేదలపై ప్రతాపం చూపిస్తూ పెద్దలతో ఒప్పందం చేసుకుంటారని విమర్శించారు. ఆరు గ్యారంటీలు గాలికి వదిలేసి, ప్రశ్నించిన వారిని జైలుకు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుభరోసా రాదు.. రుణమాఫీ కాదన్నారు. అలాగే పంటలు కొనుగోలు చేయరని కేటీఆర్ విమర్శించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో దేశానికే దిక్సూచిగా ఎదిగిన తెలంగాణను 15 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని పాతాళానికి తీసుకెళ్లారని మండిపడ్డారు. ఇది పాలన కాదు పీడన అని అన్నారు. అలాగే ఇది సర్కారు కాదు సర్కస్ కంపెనీ అని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.