పార్టీ కోసం పని చేసిన వారిని, ఎన్నికల్లో గెలిచేందుకు కృషి చేసిన వారిని ఎవరూ పట్టించుకోరా? అని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సొంత పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏఐసీసీ కార్యదర్శి విష్ణు, దీపాదాస్ మున్షిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తాము సీనియర్లమని, తమను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.కొత్త వారికి ప్రాధాన్యత ఇచ్చే విషయం ఖరారయ్యే వరకు తమకు సమాచారం ఇవ్వరా? అని నిలదీశారు. పార్టీ కోసం పని చేసిన వారిని, ఎన్నికల్లో గెలిచేందుకు కృషి చేసిన వారిని పట్టించుకోవాలన్నారు. అసలు విష్ణు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నారా? లేక వేరే రాష్ట్రానికి వెళ్లిపోయారా? అని నిలదీశారు. మెదక్ జిల్లాను తానే చూస్తున్నానని చెప్పిన విష్ణు ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. దీపాదాస్ కూడా తెలంగాణ రాష్ట్రానికే పని చేస్తున్నారా? వేరే రాష్ట్రానికి వెళ్లారా? అని చురక అంటించారు.