తెలంగాణలో డిసెంబర్ 12 నుండి 14 వరకు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని.. భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు చలిగాలుల హెచ్చరికను జారీ చేసింది. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. డిసెంబర్ 16 వరకు 4 నుండి 10 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలకు నమోదు కావొచ్చని ఆరెజ్ హెచ్చరిక జారీ చేసింది.ఐఎండీ ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గుతాయి. పొడి వాతావరణం కొనసాగుతుండగా.. శీతాకాలపు చలి తీవ్ర తరం అవుతుందని ఐఎండీ అంచనా వేసింది. గురువారం, ఆదిలాబాద్‌లోని బేలాలో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత 7 డిగ్రీలుగా నమోదైంది. ఇటు హైదరాబాద్ సమీపంలోని బీహెచ్ఈఎల్ ఏరియాలో కనిష్టంగా 10.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఆదిలాబాద్‌లో ఉష్ణోగ్రతలు తగ్గుతూనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో గురువారం 7.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంతకుముందు రోజు 9.7గా ఉంది. మైదాన ప్రాంతాలతో పోలిస్తే కొండ ప్రాంతాలు 1 నుంచి 2 డిగ్రీల వరకు చల్లగా ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాబోయే 48 గంటల్లో హైదరాబాద్‌లో ఉదయం పూట పొగమంచు కురుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆకాశం మేఘావృతమైన ఉంటుందని అంచనా వేశారు.