టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి అరుదైన గౌరవం దక్కింది. డిసెంబర్ నెలకు గానూ ప్రముఖ మ్యాగజైన్ "ఔట్‌లుక్ బిజినెస్" రూపొందించిన "ఛేంజర్ మేకర్స్-2023" జాబితాలో చోటు దక్కింది.భారత దేశంలో అత్యంత ప్రభావవంతంగా మార్పు తీసుకురాగల వ్యక్తులతో ఈ జాబితా రూపొందించబడింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లినే కావడం విశేషం. ఈ జాబితాలో ప్రముఖ రాజకీయవేత్త రాహుల్ గాంధీ, సినిమా రంగం నుంచి షారుక్ ఖాన్, ఎస్‌ఎస్ రాజమౌళీ.. క్రీడారంగం నుంచి జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తదితరులకు చోటు దక్కింది.
ఇదిలా ఉంటే, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి వన్డే వరల్డ్‌కప్ 2023 పూర్తయినప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాడు. స్వదేశంలో ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా అతను పాల్గొనలేదు. త్వరలో ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటనలోనూ విరాట్ పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరంగా ఉంటున్నాడు. ఈ సిరీస్ చివరన జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో విరాట్ రీఎంట్రీ ఇస్తాడు. వరల్డ్‌కప్‌లో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన విరాట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. బెంగళూరు వేదికగా నిన్న (డిసెంబర్ 3) జరిగిన నామమాత్రపు ఐదో టీ20లో టీమిండియా 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా డిఫెండ్ చేసుకుని అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి 160 పరుగులు చేసిన భారత్.. బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో ఆసీస్‌ను నిలువరించగలిగింది. ఆఖరి ఓవర్లో ఆసీస్ గెలుపుకు 10 పరుగుల చేయాల్సిన తరుణంలో అర్షదీప్ సింగ్ మ్యాజిక్ చేశాడు. 6 బంతుల్లో వికెట్ తీసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి టీమిండియాను గెలిపించాడు.