ఏపీ రైతులకు లబ్ధి చేకూర్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ క్రమంలోనే సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. వరి, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటల నుంచి రైతులను ఉద్యానవన పంటలవైపు మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యాన పంటలపై అంతగా దృష్టిపెట్టలేదు. ఈ నేపథ్యంలో ఉద్యాన పంటల సాగుపై ఫోకస్ పెట్టిన ఏపీ ప్రభుత్వం.. వాటిని సాగుచేసే రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పథకాన్ని అనుసంధానం చేసి రైతులకు లబ్ధి చేకూర్చేలా ప్రణాళికలు రచిస్తోంది.
అందులో భాగంగా ఉద్యాన పంటలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉద్యాన పంటలను సాగు చేసే రైతులకు ఆర్థిక సాయం అందించేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే ఈ ఆర్థిక సాయాన్ని నేరుగా కాకుండా రైతులకు రాయితీపై అందివ్వనున్నారు. ఈ క్రమంలోనే ఉద్యాన పంటల మొక్కలను రైతులకు తక్కువ ధరకు అధికారులు అందించనున్నారు. అలాగే రైతులకు ఉద్యాన పంటల సాగుకు అవసరమయ్యే నిర్వహణ ఖర్చులను కూడా కొంతమేరకు భరించనున్నారు. ఈ విధానం ద్వారా ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు తక్కువ ఖర్చుతో పంటలు పండించేందుకు వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు ఈ ప్రయోజనాలు పొందాలంటే కొన్ని అర్హతలను నిర్ణయించే అవకాశం ఉంది. ఐదు ఎకరాల లోపు భూమి ఉండే చిన్న, సన్నకారు రైతులు ఈ పథకం ప్రయోజనం పొందేందుకు అర్హులు. అలాగే సాగునీరు అందుబాటులో ఉండాలి. బోరు ఉన్నప్పటికీ అర్హులే. వ్యవసాయ పొలానికి విద్యుత్ సరఫరా ఉండాలి. అలాగే పట్టాదార్ పాసు పుస్తకం, 1బీ ఉండాలి. వీటన్నింటి ఆధారంగా స్థానిక తహశీల్దారు పథకానికి అర్హులో కాదో నిర్ణయిస్తారు. మరోవైపు అర్హులైన రైతులు బ్యాంక్ పాసు పుస్తకం, రేషన్ కార్డు, ఆధార్ కార్డుల వంటి పత్రాలను ఉపాధి హామీ పథకం అధికారులకు అందిస్తే వారు అన్నీ పరిశీలించి.. సాయం అందిస్తారు. దీని ద్వారా సంప్రదాయ పంటలవైపు నుంచి ఉద్యాన పంటలవైపు రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది.