మార్కెట్‌లో గాడిద పాలకు మంచి డిమాండ్ ఉందనే ప్రచారాన్ని నమ్మి.. కొందరు ఆశపడి చివరకు మోసపోయారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో గాడిద పాల వ్యాపారం పేరుతో వందలాది మందిని బురిడీ కొట్టించి.. రూ.100 కోట్లకుపైగా కాజేశాడు కేటుగాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు.. తమనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా ముక్కుడల్‌లో డాంకీ ప్యాలెస్ పేరుతో ఫామ్ మొదలుపెట్టిన నిందితుడు బాబు ఉలగనాథన్.. తన ఫామ్ దగ్గర యూ ట్యూబ్‌లో వీడియోలు తీస్తూ.. లీటరు గాడిద పాలను రూ.1600 నుంచి రూ.1800కు కొనుగోలు చేస్తానని ప్రచారం చేశాడు. భారీగా ఆర్డర్లు వస్తున్నాయని.. కానీ డిమాండ్ తగ్గ సరఫరా చేయలేకపోతున్నానని, ఎవరైనా తనకు గాడిద సప్లై చేస్తే తీసుకుంటానని.. నెలకు రూ. లక్షన్నర వరకు ఆదాయం వస్తుందని ఊదరగొట్టాడు. యూ ట్యూబ్ ఛానల్ వీడియోలతో చాలామంది నిజమని నమ్మి.. లక్షల్లో అతడికి సమర్పించుకున్నారు.
తన దగ్గర మేలుజాతి గాడిదలు ఉన్నాయని, వాటి పాల వ్యాపారంతో మంచి లాభాలు వస్తాయని బుట్టలో వేసుకున్నాడు. ఏకంగా విల్లుపురంలో డాంకీ సెమినార్లు కూడా నిర్వహించారు.. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడుకు చెందిన రైతులు అతడి వలలో చిక్కారు. ఒక్కో గాడిదకు కనీస ధర రూ.90 వేలు నుంచి రూ.లక్షన్నర వరకూ వసూలు చేశాడు. గాడిదల నుంచి తీసిన పాలు గంటకు మించి నిల్వ ఉండవని, వాటిని భద్రపరిచేందుకు హై కెపాసిటీ ఫ్రీజర్లు ఉండాలని అదనంగా రూ.75వేల నుంచి రూ. లక్షన్నర కొట్టేశాడు. వాటిని తిరునల్వేలి నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి అక్కడి నుంచి అందరికీ పంపించాడు.
ఫ్రాంచైజీలో సభ్వత్వం పేరుతో మరో రూ.5 లక్షలు, గాడిదల వైద్యం నిపుణుడని ఓ వెటర్నరీ డాక్టర్‌ను చూపించి, ఆయన శిక్షణ ఫీజుల పేరుతో ఇంకో రూ.50 వేలు నొక్కేశాడు. ప్రతి సభ్యుడి నుంచి రూ.25 లక్షలు నుంచి కోటిన్నర, నిరంతరం నిర్వహణ పేరుతో అదనంగా మరికొంత వసూలు చేశాడని బాధితులు వాపోయారు. ఉలగనాథ్‌తో పాటు గిరి సుందర్, సోనిక్, బాలాజీ, డాక్టర్ రమేశ్ అని వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, డాంకీ ప్యాలెస్ ప్రారంభోత్సవానికి తమిళనాడు ఎఫ్ఎస్ఎస్ఏఐ డైరెక్టర్ అమిత్ శర్మ, తిరునల్వేలి కలెక్టర్ విష్ణు వేణుగోపాలన్ హాజరయ్యారని, వారికీ ఇందులో వాటా ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు. మేము కలెక్టర్‌ను సంప్రదించే ప్రయత్నం చేస్తే ఆయన స్పందించలేదని ఆరోపించారు. అంతేకాదు, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ ఆఫీస్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత మీడియా ముందు మాట్లాడొద్దని ఆదేశించారని ఆరోపణలు చేశారు.