మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగతంగా వెళ్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందంటూ తీవ్రంగా మండిపడ్డ కన్హయ్య కుమార్.. మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై, ఆయన భార్యపై సంచలన ఆరోపణలు గుప్పించారు. మతం పేరుతో అమాయక ప్రజలను ఒకవైపు రెచ్చగొడుతూ.. మరోవైపు.. వాళ్ల పిల్లలను మాత్రం విదేశాల్లో చదివిస్తున్నారని మండిపడ్డారు.
నాగ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమృతా ఫడ్నవీస్ పేరును నేరుగా ప్రస్తావించకుండా కన్హయ్య కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాగ్‌పూర్ సౌత్‌వెస్ట్ నియోజకవర్గం నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ పోటీ చేస్తున్నారు. ఇదే సీటు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రఫుల్ల గూడాఢే బరిలో ఉన్నారు. రాజకీయ నాయకుల పిల్లలు విదేశాల్లో చదువుకుంటుంటే సాధారణ ప్రజలు మాత్రమే ఎందుకు మతాన్ని రక్షించుకోవాలో చెప్పాలంటూ కన్హయ్య కుమార్.. బీజేపీ నేతలను ప్రశ్నించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన భార్య అమృత ఫడ్నవీస్‌ను ఉద్దేశించి పేర్లు ప్రస్తావించకుండానే పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విభజన పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
"ఇది ధర్మ యుద్ధమే అయితే మీకు ప్రసంగాలు ఇస్తున్న నాయకులను ఒక మాట అడగండి.. ఈ యుద్ధంలో నాయకుల పిల్లలు కూడా పాల్గొంటారా అని.. వాళ్లేమో విదేశాల్లో చదువుకుంటుంటే మనం మతాన్ని రక్షించుకోవాలా?" అని నిలదీశారు. ఇక డిప్యూటీ సీఎం భార్య ఒకరు.. క్లాసికల్ డ్యాన్సర్, బ్యాంకర్ కూడా. ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రీల్స్‌తో బిజీగా ఉంటుందా అని కన్హయ్య కుమార్ ప్రశ్నలు గుప్పించారు.
కొత్త పంబన్ వంతెన చూశారా.. సముద్రంపై ఇంజనీరింగ్ అద్భుతం
ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా కుమారుడు జై షా పైనా కన్హయ్య కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. మరి ఐసీసీ ఛైర్‌పర్సన్‌గా ఉన్న అమిత్ షా కుమారుడు కూడా ఈ మతాన్ని రక్షించుకునే పోరాటంలో పాల్గొంటారా అని ప్రశ్నించారు. క్రికెట్‌లో డ్రీం 11 జట్టును తయారు చేయాలని వారు చెప్తుంటారు. మనం మాత్రం ఎప్పటికీ జూదగాళ్లలాగానే మిగిలిపోతున్నాం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇఖ కన్హయ్య కుమార్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇది ప్రతీ మరాఠీ మహిళను అవమానించడమేనని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా పేర్కొన్నారు. కన్హయ్య కుమార్ ఒక ఉగ్రవాది అని.. పార్లమెంట్‌పై దాడి చేసిన అఫ్జల్ గురు మద్దతుదారుడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అఫ్జల్ గురు వర్ధంతి సందర్భంగా జేఎన్‌యూలో ఓ కార్యక్రమం నిర్వహించి.. 2016లో కన్హయ్య కుమార్ దేశ ద్రోహం కింద అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దేవేంద్ర ఫడ్నవీస్ ఓట్ జిహాద్ వ్యాఖ్యలు చేసిన తర్వాత కన్హయ్య కుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.