కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని ఢిల్లీ నగరం విలవిలలాడుతోంది. రోజు రోజుకూ వాయు నాణ్యత సూచీ దారుణంగా పడిపోతోంది. దట్టమైన పొగమంచు అలముకుంది. వరుసగా మూడో రోజు వాయునాణ్యత సూచీ (ఏక్యూఐ) అత్యంత ప్రమాదక తీవ్రత స్థాయిని దాటేసింది. శుక్రవావారం ఉదయం ఏకంగా 498 పాయింట్లగా నమోదైంది. ప్రపంచంలోనే రెండో అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. పాకిస్థాన్‌లోని లాహోర్ నగరం 770 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఇక, ఢిల్లీలోని జహంగీర్‌పూర్ (458), బవానా (455), వాజీపూర్ (455), రోహిణి (452), పంజాబీ బాగ్ (443)లో అత్యంత తీవ్రమైన కాలుష్యకారక ప్రాంతాలుగా నిలిచాయి. పొగమంచు కమ్మేయడంతో పక్కన ఉన్నవారు సైతం కనిపించని పరిస్థితి. ఇది ఢిల్లీ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే విమాన, రైలు సర్వీసులపై పడింది. పలు విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్‌ఏపీ)3 శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో అత్యవసరం కాని నిర్మాణ పనులు, కూల్చివేతలు.. పెట్రోల్‌తో నడిచే బీఎస్-3, డీజిల్‌తో నడిచే బీఎస్-4 వాహనాలు, డీజిల్ జనరేటర్లపై నిషేధం అమలుకానుంది. రహదారులపై దుమ్మును పారద్రోలడానికి నీళ్లు చల్లే ప్రక్రియ కొనసాగిస్తారు. ప్రజారవాణా సేవలను పెంచనున్నారు.
అటు, కాలుష్యం తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలలు (ఐదో తరగతి వరకు) ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆతిశీ ఆదేశించారు. తదుపరి ఆదేశాలు వెలువరించే వరకూ ఇవి కొనసాగుతాయన్నారు. కాలుష్య తీవ్రత దృష్ట్యా అన్ని ప్రైమరీ స్కూల్ తరగతులు ఆన్‌లైన్‌కు మారుతున్నట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు.
పొరుగున ఉన్న పంజాబ్, హర్యానాలలో పంట వ్యర్ధాల దగ్ధం వంటి సంఘటనలు అధికం కావడమే కాలుష్యానికి ఓ కారణమని నిపుణులు అంటున్నారు. అందుకు సంబంధించిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇటివల విడుదల చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పంజాబ్, హర్యానాలలో లైవ్ ఫైర్ మ్యాప్ భారీ అగ్నిప్రమాదాల నాసా ఫోటోలు ఈ కాలుష్యం తీవ్రతను స్పష్టంగా చూపిస్తుండటం విశేషం.
ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు, నవంబర్ మొదటి వారంలో సింధు-గంగా మైదానాల్లో రైతులు పంట కోతల తర్వాత వ్యర్థాలను తగులుబెట్టారు. ఆ క్రమంలో వచ్చిన పొగ మేఘాలను నాసా ఉపగ్రహాలు గుర్తించాయి. పంజాబ్, ఉత్తర భారతదేశం, పాకిస్థాన్ వంటి జనసాంద్రత కలిగిన ప్రాంతాలు ముఖ్యంగా ప్రభావితమవుతున్నాయి. పంజాబ్‌లోని రైతులు తరచుగా గోధుమ, వరి పంట కోసం పొలాలను సిద్ధం చేయడానికి వాటి అవశేషాలను తగులబెడతారు. ఇది చౌకైన పద్ధతి అయినప్పటికీ, దీని కారణంగా వచ్చే కాలుష్యం ఢిల్లీ పరిధిలోని ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం చూపుతోంది.