ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఇన్నోవా కారు వేగంగా వెళ్లి లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు అబ్బాయిలు కాగా.. మరో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. మద్యం సేవించి, అతి వేగంగా వాహనం నడపటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
సోమవారం అర్ధ రాత్రి దాటాక డెహ్రాడూన్‌లోని ఓఎన్జీసీ చౌక్‌లో జరిగిన ఈ ప్రమాదం దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. షహరాన్‌పూర్‌కు చెందిన సునీల్ అగర్వాల్ అనే టపాసుల వ్యాపారి ధంతేరాస్ పండుగకు ముందు ఈ వాహనాన్ని కొనుగోలు చేశారు. ఆయన కుమారుడైన అతుల్ అగర్వాల్ (24) స్నేహితుడొకరు.. కొత్త కారు కొన్నందుకు పార్టీ ఇవ్వాలని బలవంతం చేశారు. దీంతో సోమవారం రాత్రి జఖాన్‌లోని సిద్దేశ్ అగర్వాల్ ఇంట్లో అతుల్ తన స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. అనంతరం తిరిగి వస్తుండగా.. ఓ లగర్జీ కారు వారి వాహనాన్ని దాటుకుంటూ ముందుకెళ్లింది. దీంతో దాన్ని ఛేజ్ చేసే క్రమంలో.. వీరు ప్రయాణిస్తున్న వాహనం ముందు వెళ్తున్న ఓ కంటైనర్ ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టిన అనంతరం చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం తీవ్రతకు వాహనం సన్‌రూఫ్ పగిలిపోవడంతో.. ఇద్దరి తలలు శరీరం నుంచి విడిపడి రోడ్డు మీద గుర్తు పట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేయగా.. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియోను ఎక్స్ డిలీట్ చేసింది. వాహనం యజమాని, దాన్ని నడుపుతోన్న అతుల్ కూడా ఈ ప్రమాదంలో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
మామూలు వేగంతోనే చెక్ పాయింట్స్ దాటుకుంటూ వెళ్లిన వీరి వాహనం.. ఓఎన్‌జీసీ జంక్షన్ వద్ద ప్రమాదానికి గురయ్యే ముందు ఒక్కసారిగా వేగాన్ని అందుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు నిర్ధారించారు. మరోవైపు ఇన్నోవా ఢీకొట్టిన తర్వాత ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ట్రక్కు మామూలు వేగంతోనే ప్రయాణిస్తోందని.. ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్ తప్పేమీ లేదని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం పోలీసులు నిర్ధారించారు. ప్రమాదంలో ఆరుగురు చనిపోయి, ఒకరి పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నప్పటికీ.. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వారి కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాలేదు.
ఈ ప్రమాదంలో మరణించిన ఆరుగుర్ని కునాల్ కుక్రేర్జా (23), అతుల్ అగర్వాల్ (24), రిషభ్ జైన్ (24), నవ్యా గోయల్ (23), కామాక్షి (20), గునీత్ (19)గా గుర్తించారు. వీరిలో కుక్రేజాది హిమాచల్ ప్రదేశ్ కాగా.. మిగతా ఐదుగురు డెహ్రాడూన్‌కు చెందినవారే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సిద్ధేశ్ అగర్వాల్ (25)ను డెహ్రాడూన్‌లోని సినర్జీ హాస్పిటల్‌లో చేర్పించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.