ప్రస్తుతం దేశంలో జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల హడావుడి జరుగుతోంది. ఇప్పటికే జార్ఖండ్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక రెండో విడత ఎన్నికలతోపాటు మహారాష్ట్ర ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నాయి. అదే సమయంలో ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలు, కేంద్రమంత్రులు.. ఈ రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి.. ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. విమానంలో టెక్నికల్ సమస్య తలెత్తింది. దీంతో ఆయన విమానం జార్ఖండ్‌లోనే నిలిపివేశారు.
దేవఘర్‌లో ఆయన ప్రయాణిస్తున్న విమానానికి సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో ఆ విమానం.. టెక్నికల్ సమస్యను పరిష్కరించేవరకు అక్కడే ఉండనుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు.. ఢిల్లీ నుంచి దేవఘర్‌కు పంపించారు. ఈ నేపథ్యంలోనే జార్ఖండ్ పర్యటన పూర్తి చేసుకున్న ప్రధాని మోదీ.. తిరిగి ఢిల్లీ వెళ్లేందుకు ఆలస్యం కానుంది. ఇక ఇవాళ జార్ఖండ్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. 2 ర్యాలీల్లో పాల్గొన్నారు. గిరిజనులు ఆరాధ్యంగా భావించే బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రధాని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జన్‌జాతీయ గౌరవ్ దివస్‌గా.. జార్ఖండ్ వాసులు బిర్సా ముండా జయంతిని జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని.. ఆ తర్వాత మరో ఎన్నికల ర్యాలీకి హాజరయ్యారు.
ఇక ఇవాళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ హెలికాప్టర్‌లో కూడా సాంకేతిక సమస్య తలెత్తింది. దేవఘర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొడ్డా జిల్లాలో ఇవాళ ఉదయం రాహుల్ హెలికాప్టర్‌లో టెక్నికల్ సమస్య వచ్చింది. దీంతో ఆ హెలికాప్టర్ 45 నిమిషాల పాటు భూమిపైనే ఉండిపోయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి క్లియరెన్స్ కోసం రాహుల్ గాంధీ ఎదురు చూశారు. అయితే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రచారాన్ని అడ్డుకోవాలనే బీజేపీ.. ఈ పరిస్థితి తెచ్చిందని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు గుప్పించింది.