రాజధాని అమరావతిని అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అమరావతి అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.15000 కోట్లు నిధులు కూడా రాబట్టుకున్న ఏపీ సర్కారు.. అమరావతి నిర్మాణంలో కీలక సంస్థలను భాగస్వాములుగా చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్టటంతో పాటుగా వివిధ రంగాల్లో అధునాతన సాంకేతికత, పరిశోధన సహకారం కోసం ఐఐటి మద్రాసుతో ఏపీ సర్కారు పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఐఐటీ మద్రాస్ ప్రతినిధులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉదయం భేటీ అయ్యారు. అనంతరం సాయంత్రం మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వానికి, ఐఐటీ మద్రాసుకు మధ్య 8 కీలక ఒప్పందాలు జరిగాయి.
రాజధాని అమరావతిలో అంతర్జాతీయ డీప్ టెక్ పరిశోధన, డిజైన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ పార్కు ఏర్పాటులో సాంకేతిక సలహాలు అందించేలా సీఆర్‌డీఏ ఐఐటీ మద్రాస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు ఫిజికల్, వర్చువల్ పద్ధతుల్లో ఐఐటిఎం సంస్థ ఎపి ప్రభుత్వంతో కలసి పనిచేస్తుంది. మరోవైపు సముద్ర పరిశోధన, కమ్యూనికేషన్, కోస్టల్ ఎనర్జీ హార్వెస్టింగ్ టెక్నాలజీల కోసం ఏపీ మారిటైమ్ బోర్డు ఐఐటీ మద్రాస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పరిశోధనతోపాటు కన్సల్టెన్సీ, విద్య, శిక్షణ ప్రయోజనాలు అందుతాయి.
మరోవైపు స్వయం ప్లస్, ఐఐట్ మద్రాస్‌కు చెందిన ప్రవర్తక్ డిజిటల్ స్కిల్ అకాడమీ వంటి ప్లాట్ ఫారాల ద్వారా నైపుణ్యాభివృద్ధిని పెంచేలా ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ.. ఐఐటీ మద్రాస్ మధ్య ఒప్పందం జరిగింది. అలాగే ఇండస్ట్రీ అవసరాలకు తగినట్లుగా అధునాతన సాంకేతిక శిక్షణ ఇచ్చేలా ఏపీ విద్యాశాఖ ఐఐటీ మద్రాస్ మధ్య మరో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఐఐటీ మద్రాస్ ప్రవర్తక్ విద్యాశక్తి ద్వారా రాష్ట్రంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు సాంకేతిక శిక్షణ ఇస్తారు.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విమానాశ్రయాలను లాజిస్టిక్స్, మెయింటెనెన్స్ హబ్‌లుగా మార్చే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఐటీ మద్రాస్ మధ్య మరో ఒప్పందం కుదిరింది. కుప్పం, పుట్టపర్తి విమానాశ్రయాలపై దృష్టిసారించడంతో పాటుగా ఆయా ప్రాంతాల్లో వ్యాపార అవకాశాలను గుర్తించడం, వాటిని అభివృద్ధి చేయడం ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం. అలాగే విశాఖపట్నాన్ని ఇంటర్నెట్ గేట్‌వేగా అభివృద్ధి చేసేందుకు, రాష్ట్రంలో అంతర్జాతీయ డేటా కనెక్టివిటీని పెంచేందుకు ఐటీశాఖ ఐఐటీ మద్రాస్ మధ్యన మరో ఒప్పందం జరిగింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డేటా సైన్స్ రంగాల్లో సాఫ్ట్ వేర్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, అమరావతిలో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో స్మార్ట్ టెక్ ఎనేబుల్డ్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సాంకేతిక సలహాలు అందించేలా ఏపీ ప్రభుత్వం, ఐఐటీ మద్రాస్ మధ్యన ఒప్పందం కుదిరింది.