మలేషియాలో జరుగుతున్న జూనియర్ పురుషుల అండర్-21 హాకీ ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో యువ భారత్‌కు శుభారంభం లభించింది. మూడోసారి విశ్వవిజేతగా నిలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. పటిష్టమైన కొరియాపై 4-2తో విజయం సాధించింది. పూల్-సి మ్యాచ్‌లో అర్జిత్ సింగ్ హుండాల్ హ్యాట్రిక్ సాధించి కొరియాను 4-2తో ఓడించాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రత్యర్థి జట్టుకు ఎక్కడా కోలుకునే అవకాశం ఇవ్వలేదు. 11వ నిమిషంలో అర్జిత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. రెండో క్వార్టర్‌లో భారత్ మరో రెండు గోల్స్ చేసింది. 16వ నిమిషంలో అర్జిత్ సింగ్, 30వ నిమిషంలో అమన్‌దీప్ గోల్స్ చేయడంతో భారత్‌కు 3-0 ఆధిక్యం లభించి విజయాన్ని ఖాయం చేసింది. అయితే మూడో క్వార్టర్‌లో కొరియా కాస్త పుంజుకుంది. 38వ నిమిషంలో లిమ్ గోల్‌తో కొరియా ఖాతా తెరిచింది. అయితే 41వ నిమిషంలో అర్జిత్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్ చేయడంతో భారత్ 4-1తో తిరుగులేని ఆధిక్యం సాధించింది.
45వ నిమిషంలో కొరియా ప్లేయర్ మింక్వాన్ గోల్ చేసినా.. ఆ తర్వాత భారత్ మరో విజయావకాశాన్ని ఇవ్వలేదు. గురువారం స్పెయిన్‌తో భారత్ తలపడనుంది. ప్రపంచకప్ తొలి మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యామని కెప్టెన్ ఉత్తమ్ తెలిపాడు. ఈసారి ప్రపంచకప్ గెలవడమే తమ లక్ష్యమని ప్రకటించాడు. ఫార్వర్డ్ ఉత్తమ్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు గురువారం జరిగే రెండో మ్యాచ్‌లో స్పెయిన్‌తో, ఈ నెల 9న కెనడాతో తలపడనుంది.