రింకూ ధనాధన్ ఇన్నింగ్స్ తో దక్షిణాఫ్రికా గడ్డపై కూడా తన సత్తా చాటాడు. ప్రొటిస్ జట్టుతో జరిగిన రెండో టీ20లో ఓపెనర్లు విఫలమైనప్పుడు.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (56)తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. కేవలం 39 బంతుల్లోనే 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అయితే వర్షం కారణంగా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను 15 ఓవర్లకు కుదించడంతో ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఓటమి తప్పలేదు. ప్రొటీస్ ఓపెనర్ రీజా హెండ్రిక్స్ కేవలం 27 బంతుల్లో 49 పరుగులు చేసింది. కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ 30 పరుగులతో రాణించాడు.
ఈ క్రమంలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్‌పై దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా, మంగళవారం పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో రింకూ సింగ్ కొట్టిన సిక్స్ కు మీడియా అద్దం పగిలిన సంగతి తెలిసిందే. పందొమ్మిదవ ఓవర్లో మార్క్రమ్ బౌలింగ్‌లో రింకూ స్ట్రెయిట్ హిట్ కారణంగా సైట్‌స్క్రీన్ బ్రేక్ అయిపోయింది. విషయం గురించి మ్యాచ్ అనంతరం స్పందించిన రింకూ సింగ్.. స్టేడియం నిర్వాహకులకు క్షమాపణలు చెప్పడం విశేషం. ఈ మేరకు బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో తన ప్రదర్శన గురించి మాట్లాడుతున్న సమయంలో.. ''ఆ బంతిని సిక్సర్‌గా మలచాలని మాత్రమే భావించాను. నా షాట్ కారణంగా అద్దం పగిలిపోయిందని నాకు తెలియదు. ఆ విషయం గురించి ఇప్పుడే తెలిసింది. గ్లాస్ బ్రేక్ చేసినందుకు సారీ చెబుతున్నా'' అని రింకూ సింగ్ పేర్కొన్నాడు.