టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. భారత టీ20 జట్టు తాత్కాలిక కెప్టెన్ మరియు ప్రపంచ నంబర్ 1 బ్యాట్స్‌మెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ దాదాపు 7 వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. చీలమండ గాయం తీవ్రంగా ఉండడంతో ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే స్వదేశంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ దూరం కానున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
కాగా, వన్డే ప్రపంచకప్-2023లో ప్రభావం చూపలేకపోయిన సూర్య.. ఈ మెగా టోర్నీ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన పొట్టి టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. తొలిసారి భారత జట్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన సూర్య.. స్వదేశంలో ఆసీస్‌తో జరిగిన సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్నాడు. ఆపై దక్షిణాఫ్రికా టూర్‌లో భాగంగా టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేశాడు. ఆటగాడిగా, కెప్టెన్ గా రాణించి దక్షిణాఫ్రికా గడ్డపై ఆతిథ్య జట్టుతో కలిసి ట్రోఫీని పంచుకున్నాడు.