మహా కుంభమేళాకు వేళాయింది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్ రాజ్‌లో మహాకుంభమేళా జరగనుంది. అయితే ఈ సారి సరికొత్తగా ఓ టెక్నాలజీని వినియోగించబోతున్నారు. ఈసారి మహాకుంభమేళాలో అండర్ వాటర్ డ్రోన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికోసం ఇప్పటికే ట్రయిల్స్ కూడా నిర్వహించారు. మహాకుంభమేళాలో స్నానమాచరిస్తూ పొరపాటున ఎవరైనా నీళ్లలోకి మునిగిపోతే తక్షణమే అండర్ వాటర్ డ్రోన్లు గుర్తించి కాపాడుతాయి.ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది యాత్రికులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకోనున్నారు. ఈసారి దాదాపు 45కోట్ల మంది యాత్రికులు, సాధువులు, సన్యాసులు, పర్యాటకులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనిని స్వచ్ఛంగా, ఆరోగ్యంగా, సురక్షిత, డిజిటల్ కార్యక్రమంగా మార్చేందుకు యూపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే మేళా కోసం ప్రత్యేక రవాణా ఏర్పాట్లను చేశారు. పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్ళు కూడా నడవనున్నాయి. అలాగే మేళా జరిగే స్థలానికి ఈజీగా చేరుకునేల బస్సులు, ఇతర వాహనాలను ఏర్పాటు చేస్తున్నామని యూపీ ప్రభుత్వం చెప్పింది. గతంలో కంటే ఈ సారి కుంభమేళా అద్భుతంగా జరుగుతుందని యూపీ జల్ శక్తి మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ చెప్పారు