అన్నమయ్య జిల్లా గాలివీడు గ్రామంలో నిన్న ఎంపీడీవో జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి దాడి చేసి తీవ్రంగా గాయపర్చడం తెలిసిందే. జవహర్ బాబు ప్రస్తుతం కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇవాళ కడప వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రిమ్స్ లో ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించారు. అనంతరం ఆయన గాలివీడు గ్రామానికి చేరుకున్నారు. దాడి జరిగిన ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించారు. ఎంపీడీవో జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి దాడి చేయడానికి దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయ సిబ్బందితో మాట్లాడుతూ, ప్రభుత్వం అండగా ఉంటుందని, ధైర్యంగా పనిచేసుకోవాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ నేతలకు స్పష్టమైన హెచ్చరికలు చేశారు. ఎవరైనా సరే ఏ ఒక్క ప్రభుత్వ అధికారిపై జులుం చేసినా, ఇష్టంవచ్చినట్టు మాట్లాడినా మా సమాధానం కరాఖండీగా ఉంటుంది అని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నాను కాబట్టి పద్ధతిగా, ఎంతో జాగ్రత్తగా మాట్లాడుతున్నాను.... నా సహనాన్ని పరీక్షించవద్దు అని పేర్కొన్నారు. ఒకవైపు రాయలసీమ యువత ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు పోతుంటే, మరోవైపు మీరు దాడుల సంస్కృతి కొనసాగిస్తారా? అని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇవాళ మేం అధికారులకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాం. ఇక నుంచి వైసీపీ వాళ్లు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడకపోయినా, సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్టు పిచ్చి కూతలు కూసినా, ఇలా ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి దాడులకు పాల్పడినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. జగన్... ధర్నాలు అని కల్లబొల్లి కబుర్లు చెప్పడం కాదు... మీ నాయకులను నిగ్రహంతో ఉండమని చెప్పు. సుదర్శన్ రెడ్డి మనుషులకు చెబుతున్నా... మీరు మళ్లీ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే నేను కడపలో తిష్ట వేస్తాను. అవసరమైతే నా క్యాంప్ ఆఫీసును కడపలోనే ఏర్పాటు చేసుకుని, మిమ్మల్ని సరిచేసేంతవరకు ఇక్కడ్నించి కదలను. రాయలసీమ ఏ ఒక్కరి జాగీరు కాదు... ఏ ఒక్కరి కోట కాదు. మీ ఇష్టానుసారం వచ్చి గవర్నమెంటు ఆఫీసుల్లో దాడులు చేస్తాం, నోటికొచ్చినట్టు మాట్లాడతాం అంటూ చూస్తూ ఊరుకునేది లేదు. అన్ని పరిస్థితులకు రాటుదేలి ఇక్కడవరకు వచ్చాం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వ్యవహరించడం లేదు. మేం చాలా సంయమనంతో ఉన్నాం... మా సహనాన్ని పరీక్షించవద్దు. గత ఐదేళ్లలో మీరేం చేసినా చెల్లిందేమో కానీ, ఇంకా మీరు ఆధిపత్య ధోరణితో వ్యవహరించాలనుకుంటే ఇక నడవదు. ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి చేసిన 15 మందిని పట్టుకెళ్లి బొక్కలో పెట్టేంతవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదు" అంటూ పవన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.