రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అర్హులైన వారికి వేగంగా, ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని సరళీకృతం చేస్తోంది. ఇందులో భాగంగా స్పౌజ్ పింఛన్లను నెలలోపే మంజూరు చేయాలని నిర్ణయించింది. పింఛన్ తీసుకునే భర్త మరణిస్తే, అతని భార్యకు పింఛన్ అందిస్తారు. అయితే దరఖాస్తు చేసుకున్న ఆరేడు నెలలకు పింఛన్లు మంజూరయ్యేవి. అయితే ఇలాంటి సమస్యలకు ఇక ఫుల్ స్టాప్ పెడుతూ భర్త చనిపోయిన వెంటనే భార్యకు ఆ నెలే పింఛను మంజూరు చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.
స్పౌజ్ కేటగిరీ కింద వితంతువులకు ఎప్పటికప్పుడు పింఛన్ అందిస్తామని నవంబరు 1వ తేదీన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశాల తర్వాత నవంబరు ఒకటి నుంచి డిసెంబరు 15 వరకు స్పౌజ్ కేటగిరీ కింద 5,402 మందికి వితంతువులకు నెలకు రూ.4 వేల చొప్పున కొత్తగా పింఛను ప్రభుత్వం మంజూరు చేసింది. వీరందరికీ డిసెంబర్ 31న పింఛన్ అందించనున్నారు. వీరితో పాటుగా పలు కారణాలతో గత మూడు నెలలుగా పింఛను తీసుకోలేని 50 వేల మంది పింఛన్ దారులకు కూడా ప్రభుత్వం పింఛన్ అందించనుంది.
వాస్తవానికి ప్రతి నెలా ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ఉంటుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారులకు పింఛన్ అందిస్తుంటారు. అయితే ఈ సారి ఒకటో తేదీ జనవరి ఫస్ట్ రావటం.. సెలవు రోజు కావటంతో ఒకరోజు ముందుగానే పింఛన్ అందించనున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 31వ తేదీన రాష్ట్రంలోని పింఛన్‌దారులకు పింఛన్ అందిస్తారు. పింఛన్ లబ్ధిదారుల ఇళ్లవద్దకే సచివాలయాల సిబ్బంది చేరుకుని పింఛన్ అందిస్తుంటారు. రాష్ట్రవ్యా్ప్తంగా ఒక్కరోజులోనే పింఛన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏవైనా సాంకేతిక సమస్యల కారణంగా పింఛన్ అందుకోలేకపోయినవారికి మరుసటి రోజు పింఛన్ అందిస్తారు.