ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. విజయవాడ వరదలు సంభవించిన సమయం నుంచి పలువురు దాతలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందిస్తున్నారు. వ్యాపారవేత్తలు, విద్యారంగ ప్రముఖులు, సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకూ తమకు చేతనైంత విరాళం అందిస్తున్నారు. అలాగే ఉద్యోగ సంఘాలు కూడా తమ తరుఫున ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందించిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగులు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారు. టీటీడీ ఉద్యోగులు రూ.1,18,36,798 లు, పదవీవిరమణ చేసిన ఉద్యోగులు (పెన్షనర్లు) రూ.71.59 లక్షలు విరాళంగా అందించారు. ఈ విరాళం తాలూకు చెక్కును సీఎం నారా చంద్రబాబు నాయుడు నివాసంలో.. టీటీడీ ఉద్యోగులు చంద్రబాబు చేతికి అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అర్చకులు కూడా పాల్గొని సీఎం చంద్రబాబును ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా టీటీడీ ఉద్యోగులను, పెన్షనర్లను చంద్రబాబు అభినందించారు. టీటీడీ ఉద్యోగులు రూ.1.19 కోట్లు, పెన్షనర్లు రూ.71.59 లక్షలు విరాళంగా ఇవ్వడాన్ని అభినందించిన ఆయన.. కష్ట సమయంలో ఒకరికొకరు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు విజయవాడ వరద బాధితుల కోసం ఇప్పటికే సినీ నటులు, ప్రముఖులు చాలా మంది విరాళాలు అందించిన సంగతి తెలిసిందే. ఈ విరాళాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధితులకు పంపిణీ కూడా పూర్తి చేసింది. పరిహారం ప్యాకేజీ ప్రకటించి వరద బాధితులకు సహాయం అందించింది.
మరోవైపు 2025 నూతన సంవత్సరం క్యాలెండర్‌ను సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ రచనలో భాగస్వాములైన తెలుగు ప్రముఖులను స్మరించుకునేలా 2025వ సంవత్సరం నూతన కేలండర్ ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి బాధ్యత వహించిన నాయకులను స్మరించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.