వైసీపీ తప్పుడు విధానాల వల్ల విద్యుత్ చార్జీలు పెరిగాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. జగన్ హయాంలో నాసిరకం బొగ్గు కొనుగోలు చేయటం వల్ల ఉత్పత్తి తగ్గిపోతే అధిక ధరలకు కరెంట్ కొన్నారని ఆరోపించారు. విద్యుత్ చార్జీలపై వైసీపీ నేతలు ధర్నాలు చేసేందుకు సిగ్గుపడాలని అన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లను అధిక రేట్లకు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఇవాళ(శనివారం) ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా గోరంట్ల మీడియాతో మాట్లాడుతూ... జగన్ నియంతలా ఏపీని పరిపాలించారని విమర్శించారు.
జగన్ ఐదేళ్లలో అభివృద్ధి పనులు ఏమీ చేయలేదని మండిపడ్డారు. అన్ని వ్యవస్థలను జగన్ నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో కరెంట్ చార్జీలు తగ్గిస్తామని తెలిపారు. జగన్ తీరు వల్ల పరిశ్రమలు మూతపడ్డాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన పింఛన్లు అందజేశామని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లోనే ఉద్యోగ నియామకాలకు శ్రీకారం చుట్టిందని అన్నారు. సోలార్ విద్యుత్ కోసం జగన్ ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో జరిగిన భూముల దోపిడీపై విచారణ జరుగుతుందని అన్నారు. వైసీపీ అక్రమాల వల్లే కూటమి నేతలను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.