వందల ఏళ్ల నాటి పురాతన రామాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలకు ఆ గుడి మొత్తం కాలిపోయింది. ఆలయంలోని దేవుడి విగ్రహాలు కాలి దెబ్బతిన్నాయి. గ్రామస్తులతోపాటు ఫైర్ సిబ్బంది పలు గంటలు శ్రమించి మంటలను అదుపుచేశారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భామ్‌గఢ్ గ్రామంలో 500 ఏళ్ల కిందట రాజులు నిర్మించిన రామాలయం ఉంది. శుక్రవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో ఆ ఆలయంలో మంటలు వ్యాపించాయి. కాగా, చెక్కతో నిర్మించిన ఆ గుడి అంతా మంటలు వ్యాపించాయి. మంటలు ఆర్పేందుకు గ్రామస్తులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఖాండ్వా నుంచి రెండు, హర్సూద్ నుంచి ఒక అగ్నిమాపక వాహనాలతో వచ్చిన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే మంటలకు ఆలయం పూర్తిగా కాలిపోయింది. అలాగే అందులోని దేవుడి విగ్రహాలు కూడా దెబ్బతిన్నాయి.మరోవైపు ఆలయంలో వెలిగించిన దీపం వల్ల మంటలు వ్యాపించి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే గుడి వెనుక చెత్త కుప్పల నుంచి మంటలు చెలరేగినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఇతర వర్గాల వారు అక్కడ చెత్తపోయడంపై వివాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. గుడిలో అగ్నిప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.