ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్‌పై తాలిబన్ల ప్రతీకారం.. ఆఫ్ఘనిస్తాన్ దాడుల్లో 19 మంది పాక్ సైనికులు హతం

international |  Suryaa Desk  | Published : Sat, Dec 28, 2024, 07:56 PM

ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న తాలిబన్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య పొసగడం లేదు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అవుతున్నారు. అయితే ఒకరిపై దాడులు చేసింది మరొకరు అని వారు అంగీకరించకపోవడం గమనార్హం. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌లో వైమానిక దాడులు జరపగా.. ఆ దాడులకు కచ్చితంగా ప్రతీకారం ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన తాలిబన్లు.. తాజాగా పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 19 మంది పాక్ సైనికులు హతమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు దేశాల మధ్య ఒక్కసారిగా ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇక పాకిస్తాన్‌పై ప్రతీకార దాడులకు సంబంధించిన విషయాన్ని అఫ్గాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


పాకిస్తాన్‌పై ఆప్ఘనిస్తాన్ ప్రతీకార దాడులకు దిగిందని.. స్వయంగా ఆఫ్ఘనిస్తాన్ రక్షణ శాఖ ప్రతినిధి ఇనాయాతుల్లా క్వార్జామి ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. పాకిస్తాన్‌లోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు, రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు స్పష్టం చేశారు. అయితే పాక్‌పై ఈ దాడులు ఎలా చేశారు.. ఆ దాడుల్లో ఎంతమంది మరణించారనే విషయాన్ని ఇనాయాతుల్లా క్వార్జామి వెల్లడించలేదు. అయితే తాలిబన్లకు మద్దతుగా ఉన్న ఓ మీడియా సంస్థ మాత్రం.. ఆఫ్ఘనిస్తాన్ సైన్యం జరిపిన దాడుల్లో 19 మంది పాకిస్తాన్‌ సైనికులు మరణించినట్లు ఒక కథనం వెలువరించింది.


అయితే తాలిబన్లు జరిపిన దాడులకు సంబంధించి ఇప్పటివరకు పాకిస్తాన్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన బయటికి రాలేదు. అయితే.. 2021లో ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవి రోజురోజుకూ పెరుగుతుండటంతో రెండు దేశాల మధ్య అగ్గిరాజుకుంటోంది. ఇక ఇటీవల తమ దేశంలో జరిగిన పలు ఉగ్రదాడులకు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలో ఉన్న తాలిబన్లే కారణమని పాకిస్తాన్‌ ఇప్పటికే ఆరోపిస్తోంది. అయితే పాక్ చేస్తున్న ఈ ఆరోపణలను మాత్రం తాలిబన్‌ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో ఆఫ్ఘనిస్తాన్‌పై దాడులు చేసిన పాకిస్తాన్.. ఇటీవల మరోసారి ఆ దేశంపై వైమానిక దాడులు చేసింది.


ఇక ఇప్పటివరకు పాకిస్తాన్ చేసిన దాడుల్లో 46 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా పలువురి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్లు వెల్లడించింది. ఇక ఈ వైమానిక దాడులపై పాక్‌ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. తమ దేశంపై దాడులకు పాల్పడిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిన ఆఫ్ఘనిస్తాన్ తాజాగా ఈ దాడులు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com