జ్వరానికి వేసుకునే పారాసిటమాల్ మాత్రలలో జ్వరమొచ్చినా, ఒళ్లునొప్పులు వచ్చినా.. మనందరికి తెలిసిన వైద్యం పారాసిటమాల్. వైద్యుల సూచన లేకుండా ఎలాంటి మాత్రలు వాడొద్దని సూచిస్తున్నా సరే.. ఏ మాత్రం జ్వరంగా అనిపించినా ఓ పారాసిటమాల్ పడాల్సిందే అంటుంటారు చాలామంది. అయితే పారాసిటమాల్ మాత్రల గురించి సోషల్ మీడియాలో ఓ రకమైన ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవమెంత అనేది ఫ్యాక్ట్ చెకింగ్ ద్వారా తెలుసుకుందాం..
అసలేంటీ క్లెయిమ్?
పారాసిటమాల్ - 500 (P-500) మాత్రలలో మచుపో వైరస్ ఉందంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన వైరస్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
అసలు నిజమెంత?
అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు. ఇది పూర్తిగా అబద్ధం అని తేలింది. చాలా దేశాలు కూడా ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని.. పూర్తిగా అవాస్తమని స్పష్టం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మెడికల్ అసోసియేషన్లు కూడా ఈ వార్తలను ఖండించాయి. ఇవి పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశాయి.
ఎలా తెలిసిందంటే?
ఫ్యాక్ట్ చెకింగ్‌లో భాగంగా వైరల్ అవుతున్న పోస్ట్‌లోని పదాలను ఉపయోగించి కీవర్డ్ సెర్చ్ చేశాం. అప్పుడు 2017, 2019, 2020 ,2021లలోనూ అదే విషయంపై ఫేస్ బుక్‌లో పాత పోస్టులు ఉన్నట్లు గుర్తించాం. అలాగే వైరల్ పోస్టును గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. 2017లో వచ్చిన ఓ ఆర్టికల్ చూపించింది. సింగపూర్‌కు చెందిన హెల్త్ సైన్సెస్ అథారిటీ ఈ ఆర్టికల్ ప్రచురించింది. పారాసిటమాల్ మాత్రల ద్వారా మచుపో వైరస్ అనేది బూటకమని.. అదంతా అవాస్తవమని సింగపూర్ హెల్త్ సైన్సెస్ అథారిటీ స్పష్టం చేసింది.
2017లో మలేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా పారాసిటమాల్ ఔషధంలో వైరస్ గురించిన పుకార్లను కొట్టిపారేసింది. ఇలాంటి బూటకపు సందేశాలు, ధృవీకరించని నివేదికలను విశ్వసించవద్దని పేర్కొందని.. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) నివేదించింది. 2020లో థాయిలాండ్ డిజిటల్ ఎకానమీ అండ్ సొసైటీ మంత్రిత్వ శాఖ కూడా ఈ పుకార్లను కొట్టిపారేసిందని.. "బూటకపు" సందేశాలను నమ్మవద్దని ప్రజలను కోరిందని థాయ్‌లాండ్‌కు చెందిన ది నేషన్ కథనం ప్రచురించింది. P-500 థాయిలాండ్‌లో ఎన్నడూ దిగుమతి చేసుకోలేదని, అలాగే డ్రగ్‌గా నమోదు చేయలేదని స్పష్టం చేసింది. అదేవిధంగా మే 25న ఇండియా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కూడా దీనిపై ట్వీట్ చేసింది. వైరల్ పోస్ట్ పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేసింది.
మచుపో వైరస్ అంటే ఏమిటి?
బొలీవియన్ హెమరేజిక్ ఫీవర్ వైరస్‌నే "మచుపో వైరస్" అని కూడా అంటారు. ఈ వైరస్ కారణంగా జ్వరం, కండరాల నొప్పులు, చిగుళ్లలో రక్తస్రావం , మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయి. "మచుపో" వైరస్ నుంచి ప్రత్యక్షంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఇది ప్రధానంగా కలుషితమైన ఎలుకల లాలాజలం, మలం, మూత్రం ద్వారా వ్యాపిస్తుంది.
అసలు వాస్తవం ఏమిటీ..?
P-500 టాబ్లెట్‌లలో మచుపో వైరస్ ఉందనే వైరల్ పోస్టులు పూర్తిగా బూటకం, నిజం కాదు. ఫ్యాక్ట్ చెకింగ్ ద్వారా ఇది పూర్తిగా అబద్ధమని ధ్రువీకరిస్తున్నాం.