కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఆ దేవదేవుడి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటారు. ఇక వారాంతరాలు, సెలవుల్లో అయితే శ్రీవారి భక్తులు సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రతీరోజు వేల సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకుని ఆయన సేవలో తరిస్తుంటారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో శ్రీవారి దర్శనానికి గంటల సమయం పడుతుంది.
ఇదిలా ఉండగా నవంబర్ నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, హుండీ కానుకలు, లడ్డూల విక్రయాలు తదితర వివరాలను ఈవో శ్యామలారావు తాజాగా వెల్లడించారు. నవంబర్ నెలలో శ్రీవారిని 20.35 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని ఈవో తెలిపారు. అలాగే హుండీ ద్వారా రూ.111 కోట్ల ఆదాయం వచ్చిందని, దాదాపు 97 లక్షల లడ్డూలను విక్రయించినట్లు తెలిపారు. 19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని.. 7.31 లక్షల మంది భక్తుల తలనీలాలు సమర్పించారని చెప్పారు.