బహిరంగంగా మద్యం, గంజాయి తాగడం, పేకాట, ఈవ్‌టీజింగ్, చైన్ స్నాచింగ్ వంటి నేరాలపై జిల్లా పోలీసు యంత్రాంగం డ్రోన్ కెమెరాల సహాయంతో నిఘా ఏర్పాటు చేసింది. శుక్రవారం శ్రీకాకుళం వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో డచ్ బంగ్లా, గుడివీధి, కంపోస్ట్ కాలనీ, అరసవల్లి, నాగావళినది పరివాహక ప్రాంతాలతో పాటు పలు ప్రాంతాల్లో పాడుపడిన బంగ్లాలు, నివాస గృహాలపై డ్రోన్ కెమెరాలతో పోలీసులు పలు చిత్రాలు తీసి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. నేర నియంత్రణే లక్ష్యంగా డ్రోన్ కెమెరాల సాయంతో పోలీసులు పహారా కాస్తు న్నారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ప్రశాంత సిక్కోలు లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైన పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.