మెల్బోర్న్ టెస్టులో వీరోచిత శతకంతో ఎక్కడ చూసినా యువ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి పేరు మార్మోగుతోంది. టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు బరిలో దిగిన నితీశ్... తిరుగులేని టెక్నిక్, పట్టుదలతో సెంచరీ సాధించిన వైనం ప్రముఖులను సైతం ఆకట్టుకుంది. టెస్టుల్లో తొలి సెంచరీ సాధించిన నితీశ్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కూడా నితీశ్ సెంచరీపై స్పందించారు. "ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో బ్రిలియంట్ సెంచరీ సాధించిన తెలుగబ్బాయి నితీశ్ కుమార్ రెడ్డికి శుభాభినందనలు. భారత జట్టు కష్టాల్లో ఉన్న వేళ, ఫాలో ఆన్ గండం పొంచి ఉన్న సమయంలో... జట్టు కోలుకోవడానికి తన వంతు కీలక పాత్ర పోషించాడు. ఇలాంటివే మరెన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ లు ఆడేందుకు ఈ సెంచరీనే నాంది అనుకుంటున్నాను. మైదానంలో నితీశ్ తన విజయప్రస్థానాన్ని ఇలాగే కొనసాగించాలని, మరింత ఖ్యాతిని అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ జగన్ తన సందేశంలో పేర్కొన్నారు.