ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసం కింద శివలింగం ఉందంటూ అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ ప్రాంతంలో చేపడుతున్న తవ్వకాలపై అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. లక్నోలో ఉన్న ముఖ్యమంత్రి అధికారిక నివాసం కింద కూడా శివలింగం ఉన్నట్లు తాను నమ్ముతున్నానని అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే సంభల్ ప్రాంతంలో తవ్వకాలను విమర్శించే క్రమంలో అఖిలేష్ యాదవ్ ఇలా సెటైరికల్ కామెంట్లు చేశారు.
" అక్కడ (సంభల్) తవ్వకం పనులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి నివాసం కింద కూడా శివలింగం ఉందని నమ్ముతున్నా.. ఆ శివలింగం అక్కడే ఉందన్న నమ్మకం ఉంది.. అక్కడ తవ్వకాలు జరిపేందుకు అందరం సిద్ధం కావాలి.. ముందుగా మీడియా అక్కడకు వెళ్తే.. ఆ వెనుకనే మేము వస్తాం.. అంటూ లక్నోలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అఖిలేష్ యాదవ్ అన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు పూశాయి. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో తొమ్మిదో రోజు తవ్వకం పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ ఈ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మరోవైపు సంభల్ జిల్లాలోని కోట్ పూర్వీ వద్ద పురాతనమైన మృత్యు కూప్ బావి పునరుద్ధరణను అధికారులు ఇటీవల చేపట్టారు. ఇందుకోసం ఇక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. ఈ బావిలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని స్థానికుల నమ్మకం. అయితే నిర్వహణ సరిగా లేకపోవటంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో మతపరమైన, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ఈ మృత్యు కూప్ బావులను పునరుద్ధరించేందుకు యూపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అయితే ఈ నిర్మాణాలు షాహీ జామా మసీదుకు సమీపంలో ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే సమయంలో ఈ స్థలంలో గతంలో హరిహర ఆలయం ఉండేదని కోర్టులో పిటిషన్లు దాఖలు కాగా.. కోర్టు సర్వే జరపాలని ఆదేశించింది. నవంబర్ నెలలో అధికారులు సర్వే కోసం ప్రయత్నించగా.. హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ హింసాత్మక ఘటనల్లో నలుగురు చనిపోవటంతో పాటు డిప్యూటీ కలెక్టర్ కూడా గాయపడ్డారు.
ఈ నేపథ్యంలోనే సంభల్ జిల్లాలో తవ్వకాలను సమాజ్‌వాదీ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఈ తవ్వకాలను యూపీ ప్రభుత్వం కొనసాగిస్తుండగా.. దీనిపై అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం ఇంటి కింద శివలింగం ఉందని.. తవ్వకాలు జరపాలంటూ సెటైర్లు వేస్తున్నారు.