2024 సంవత్సరంలో పోలీసుశాఖ ఎన్నో సవాళ్లను అదిగమించిందని పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు తెలిపారు. సోమవారం పోలీస్ కమాండ్ కంట్రోల్ కాన్ఫరెన్స్ హాల్‌లో వార్షిక నేర సమీక్షను సీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలీసుశాఖ పని తీరు ఎంతో అద్భుతంగా ఉందన్నారు. ప్రజలకు సేవ చేయడంలో పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా సేవలు అందించిందన్నారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, ఇంకా చాలా గమ్యాలను చేరుకోవాల్సి ఉందన్నారు. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారాలను చూపిస్తూ విజయం సాధించామన్నారు.
అస్త్రం అనే ఆలోచన విధానం కలిగిన యాప్‌తో దసరా ఉత్సవాలను, అలాగే ట్రాఫిక్ సమస్యలను విజయవంతంగా పరిష్కరించామని వెల్లడించారుర. భవాని దీక్షలను పోలీస్ శాఖ పనితీరుతో అద్భుతంగా నిర్వహించామన్నారు. దాతలు ముందుకు వచ్చి 27 డ్రోన్స్ ఇవ్వడం జరిగిందని.. ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఒక డ్రోన్ అందజేశామన్నారు. డ్రోన్స్ ద్వారా అధునాతన టెక్నాలజీతో అనేక నేరాలను అరికట్టామన్నారు.2025 లో అనేక విధానాలతో ముందుకు వెళతామన్నారు. అస్త్రం యాప్‌ను ఉపయోగించుకుని రాబోయే ఫ్లై ఓవర్ బ్రిడ్జిలపై అలాగే మరెన్నో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టనున్నామన్నారు. సైబర్ సిటిజన్ యాప్ ద్వారా అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్లడం జరిగిందన్నారు. దాదాపు 3 లక్షల మంది విద్యార్థులను సబ్‌స్ర్రైబర్‌లుగా చేశామన్నారు. సైబర్ సిటిజన్ యాప్ ద్వారా అవగాహన కల్పిస్తూ సైబర్ నేరగాళ్ల ఆట కట్టించడం జరిగిందన్నారు. వరదల సమయంలో పోలీస్ శాఖ అద్భుతంగా పనిచేసి 14 రోజుల పాటు విశిష్ట సేవలు అందించడం అభినందనీయమని కొనియాడారు.