విజయవాడ- అమరావతి మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి.. మెట్రో స్టేషన్ల స్థలాలను ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్.. ఖరారు చేసింది.ఫేజ్-1 కింద మొత్తం 38.4 కిలోమీటర్ల మేర మెట్రో అందుబాటులోకి రానుంది. కారిడార్- 1ఏలో గన్నవరం నుంచి పీఎన్బీఎస్ ఉంటుంది. దీంట్లో 22 స్టేషన్లు ఉండనున్నాయి. కారిడార్-2 బీలో పెనమలూరు నుంచి పీఎన్బీఎస్ వరకు 11 స్టేషన్లు ఉండనున్నాయి.కారిడార్- 1ఏ గన్నవరం నుండి పీఎన్‌బీఎస్ వరకు ఉంటుంది. దీంట్లో గన్నవరం బస్టాండ్, యోగాశ్రమం, విమానాశ్రయం, కేసరపల్లె, వేల్పూరు, గూడవలి, శ్రీ చైతన్య కళాశాల, నిడమనూరు రైల్వేస్టేషన్, ఎనికెపాడు, ఎంబిటి సెంటర్, ప్రసాదంపాడు, రామవరప్పాడు రింగ్, గుణదల, పడవలరేవు, సీతారామపురం ఎస్.సి. బీసెంట్ రోడ్, రైల్వే స్టేషన్ తూర్పు, రైల్వే స్టేషన్ సౌత్ స్టేషన్లు ఉండనున్నాయి.
కారిడార్-2బీలో..
కారిడార్-2 బీ పీఎన్‌బీఎస్ నుండి పెనమలూరు వరకు ఉంటుంది. దీంట్లో పీఎన్‌బీఎస్, విక్టోరియా జూబ్లీ మ్యూజియం, మున్సిపల్ స్టేడియం, టిక్కిల్ రోడ్, బెంజ్ సర్కిల్, ఆటో నగర్, అశోక్ నగర్, కృష్ణ నగర్, కానూరు సెంటర్, తాడిగడప, పోరంకితో సహా 11 స్టేషన్లు ఉన్నాయి. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి మొదటి దశ డీపీఆర్‌ను ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది.మొదటి దశలో.. 1ఏ కారిడార్‌లో భాగంగా.. గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు నిర్మాణం చేపట్టనున్నారు. 1బీలో భాగంగా.. పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం దూరం 38.40 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి అంచనా వ్యయం రూ.11,009 కోట్లు ఉంది. ఇందులో భూసేకరణ ఖర్చు రూ.1,152 కోట్లు. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. రెండో దశలో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి.. రిజర్వాయర్ స్టేషన్ వరకు నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం దూరం 27.75 కిలోమీటర్లు ఉంటుంది.
రూ.50 కోట్లు కేటాయింపు..
అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్‌ను ట్రాక్‌లో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2024-25 వార్షిక బడ్జెట్‌లో ఆ సంస్థకు రూ.50 కోట్లు కేటాయించింది. భూ సేకరణ పనులకు ఈ నిధులు వినియోగించనున్నారు. కూటమి ప్రభుత్వం విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టులకు అయ్యే మొత్తం ఖర్చును దశల వారీగా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖ రాసి మెట్రో ప్రాజెక్టులకు సహకరించాలని కోరారు.