కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ వర్సెస్ వైసీపీ ఎంపీ పిల్లి బోస్ అన్నట్లుగా పరిస్థితులు మారాయి. ఆదివారం మంత్రి సుభాష్ విసిరిన సవాల్‌కు స్పందనగా ఓపెన్ డిబేట్‌కు వైసీపీ ఎంపీ సిద్ధమయ్యారు. తన ఆరు నెలల పాలనలో అభివృద్ధి, గత ఐదేళ్ల వైసీపీ అవినీతిపై డిబేట్‌కు రావాలని బోస్‌కు మంత్రి సవాల్ విసిరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ‘‘ బహిరంగ డిబేట్ ఎక్కడ? ఎప్పుడు ఏర్పాటు చేసినా నేను, నా కుమారుడు వస్తాము’’ అని సవాల్ విసిరారు. ప్రజల్ని తాము పీడించలేదని.. టీడీపీ కార్యాలయంలో డిబేట్ పెట్టినా రావడానికి సిద్ధమని బోస్ స్పష్టం చేశారు. ‘‘మీ నాయకుడు ఉత్తముడుగా చేయడం లేదు.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు’’ వీటిపై చర్చిద్దాం రమ్మంటూ మంత్రికి బోస్ ఛాలెంజ్ చేశారు.
ఎన్నికల హామీలు నూటికి నూరుశాతం అమలు చేసిన ఎన్నికలకు వెళ్లిన దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అన్నారు.‘‘నేను ఒక రాజకీయ నాయకుడిని.. సంఘ సంస్కర్తను కాను... మా పార్టీలో వారు అవినీతికి పాల్పడితే ఆ విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళతా కానీ సంఘ సంస్కర్తలా ప్రకటనలు చేయం. గత ఐదేళ్లలో మా పార్టీ నాయకుడు అవినీతికి పాల్పడ్డాడని నీ దగ్గర ఆధారాలు ఉంటే నీవు మంత్రివిగా అతనిపై కేసు పెట్టి అరెస్టు చేయించు. అంతేగానీ గతంలో వేణుగోపాల కృష్ణను ఏమి అడుగు లేదు కాబట్టి నేను అవినీతి చేస్తే అడుగకూడదు అనే భావనతో మంత్రి వాసంశెట్టి ముందరి కాళ్లకు బంధం వేస్తున్నట్లుగా ఉంది. ప్రతిపక్షంగా మీరు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామని ఎంపీ బోస్ స్పష్టం చేశారు.