హీరో అల్లు అర్జున్ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పవన్ మాట్లాడుతూ.. గోటితో పోయే దానిని గొడ్టలి వరకు తెచ్చారనేది తన అభిప్రాయమన్నారు. రేవంత్ రెడ్టి చాలా గొప్ప నాయకుడని.. కింద నుంచి ఎదిగారన్నారు. వైసీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదని తెలిపారు. అక్కడ బెన్‌ఫిట్ షోలు, టిక్కెట్లు ధర పెంపుకు అవకాశం ఇచ్చారన్నారు. ప్రజలు సినిమా హీరోల పట్ల ప్రేమ, ఆదరణ చూపుతారన్నారు. హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారన్నారు. అర్జున్ విషయంలో ముందూ, వెనుక ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. కళాకారులకు ఒక పొగడ్త, అవార్డు అనేది వెలకట్టలేమన్నారు. ‘‘మేము సినిమా థియేటర్‌కు వెళ్లడం ఎప్పుడో మానేశాము. ఇటువంటి ఘటనల్లో పోలీసులను నేను ఎందుకు తప్పు పట్టను అంటే వారు ముందు భద్రత గురించి ఆలోచన చేస్తారు.
విజయనగరంలో నన్ను కూడా ముందు వద్దనే చెప్పారు. చిరంజీవి ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్‌కు వెళ్లేవారు. నేనూ అలాగే వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంలో స్టాఫ్ అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సింది. ఆయన వెళ్లి కూర్చున్నాక... ఘటన గురించి చెప్పి తీసుకెళ్లాల్సింది. చట్టం అందరికీ సమానం. అర్జున్‌కు చెప్పి ఉన్నా ఒక్కోసారి ఆ అరుపుల్లో అతనికి వినిపించలేదేమో. అల్లు అర్జున్ తరపున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లి ఉంటే బాగుండేది. అప్పుడు రచ్చ అవకుండా ఉండేది. ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలచి వేసింది. గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తెచ్చారనేది నా అభిప్రాయం. ఇంతమంది మేము అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సింది. అభివాదం చేయకపోతే... ఆ నటుడుపై ప్రజల్లో వేరే భావన ఉంటుంది. పొగరు, బలుపు అని అందరూ చర్చ పెడతారు. ఈ ఘటనలో నా వల్ల చనిపోయారనే వేదన అర్జున్‌లో ఉంటుంది. వెళ్లి ఆ బిడ్ట కోసం మేమున్నాం అనే భరోసా ఇవ్వాలి. సినిమా అంటే టీం... అందరూ భాగస్వామ్యం ఉండాలి. ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారు. ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం’’ అని పవన్ అన్నారు.