గత ఆరునెలల్లో తిరుపతి జిల్లాలో క్రైం రేటు బాగా తగ్గిందని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. సోమవారం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. పటిష్టమైన పకడ్బందీ భద్రతా ఏర్పాట్లతో నేరనియంత్రణ చేలగలిగామన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు వివరిస్తూ పూర్తి స్థాయి అవగాహన కల్పించామన్నారు. యువతలో మార్పు తీసుకువచ్చామన్నారు. సైబర్ నేరాలు పెరిగాయని.. కానీ సైబర్ నేరాలకు పాల్పడిన నేరస్తులను అరెస్టులు చేసి బాధితులకు న్యాయం చేశామన్నారు. సైబర్ క్రైం వారోత్సవాలను కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో నిర్వహించామని చెప్పారు. తిరుమల పర్యటనకు వచ్చిన వీఐపీలందరికీ పటిష్టమైన భద్రత కల్పించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అప్రమత్తంగా వ్యవహరించామన్నారు.
రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయన్నారు. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని సంచలనాత్మక కేసులను త్వరితగతిన చేధించానమన్నారు.శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకున్నామని... పీడీ యాక్ట్‌లు పెట్టడంతో స్మగ్లర్లు వెనక్కి తగ్గారన్నారు. హోంస్టేలపై ప్రత్యేక నిఘా పెంచామని... అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా అడ్డుకట్ట వేశామన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఆరునెలల్లో ఏడు శాతం కేసులు తగ్గాయని ఎస్పీ వెల్లడించారు.