వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికు క్రెడిబులిటీ లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఐదేళ్లలో ఏం జరిగింది...ఇప్పుడు ఏం జరిగింది అని ప్రజలు చూస్తున్నారన్నారు. జగన్ ఎప్పుడు ఏం చేస్తారనేది అతనికే తెలియదని ఎద్దేవా చేశారు. క్రెడిబిలిటీ లేని నాయకులు, హిడెన్ ఏజెండాతో మాట్లాడతారని సెటైర్లు గుప్పించారు. వాస్తవాలు లేకుండా జగన్ మాట్లాడతారని మండిపడ్డారు.అబద్ధాలతో రాజకీయం చేశారని.. ఇప్పుడు అలాకాదని అన్నారు. మీడియా, ఫైనాన్స్, వ్యవస్థలు, వ్యక్తులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు.
వాటర్ సెక్యూరిటీకి ఎంతో ప్రాధాన్యం ఇచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు గంగా ప్రాజెక్టు చేపట్టిన తర్వాత ఇందిరా గాంధీ సమక్షంలో అగ్రిమెంట్ జరిగిందని గుర్తుచేశారు. గండికోట, సోమశిల విస్తరణ, కండలేరు వంటి ప్రాజెక్టులు ముందుకు తీసుకువెళ్లామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 7 మండలాలు తెలంగాణలో ఉన్న వాటిని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి చెప్పి వాటిని ఏపీలో విలీనం చేశామని గుర్తుచేశారు. దీనికోసం రాష్ట్రపతితో సంతకం చేశాక పార్లమెంట్ సమావేశంలో బిల్లు పెట్టారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.