అమరావతిలో నిర్మించనున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి ప్రవాసాంధ్రుడు డాక్టర్ సూరపనేని వంశీకృష్ణ, డాక్టర్ ప్రతిభ దంపతులు భూరి విరాళం అందజేశారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం అత్తలూరు గ్రామానికి చెందిన వీరు సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి, రూ.కోటి చెక్కును అందించారు. వంశీకృష్ణ, ప్రతిభ దంపతులను సీఎం అభినందించారు. రాజధాని అమరావతి నిర్మాణంలోనూ ఎన్నారైలు పాలుపంచుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. కాగా, ఈ చెక్కును బసవతారం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సీఎం అందించనున్నారు. సీఎంను కలిసిన వారిలో డాక్టర్ ప్రతిభ తండ్రి నూతలపాటి సురేంద్రబాబు, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఉన్నారు.