చల్లగా బీర్ తాగుదామని ఫ్రెండ్‌తో కలిసి బార్‌కు వెళ్లాడు. జేబులో నుంచి డబ్బులు తీసి ఇచ్చాడు.. కట్ చేస్తే కొద్దిసేపటికి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.. అరెస్ట్ చేశారు. సీన్ కట్ చేస్తే పెద్ద దందానే బయటపడింది. మచిలీపట్నంకు చెందిన కన్నెగంటి రామకృష్ణ గత నెల 26న బస్టాండ్ సెంటర్ సమీపంలోని ఎస్‌ఆర్డీ బార్ అండ్ రెస్టారెంట్లో బీర్ తీసుకుని రూ.500 దొంగ నోటు ఇచ్చారు. అయితే బార్ నిర్వాహకులకు అనుమానం వచ్చి అతడ్ని పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు బార్ దగ్గరకు చేరుకుని దొంగ నోట్లు మారుస్తున్న రామృకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో జిల్లా ఎస్పీ ఆదేశాలతో దర్యాప్తు చేస్తే.. రామకృష్ణ నుంచి మరింత సమాచారాన్ని సేకించారు. అప్పుడు అసలు గుట్టు బయటపడింది. రామకృష్ణతో పాటుగా వీరాచారి, సత్యనారాయణ, శివప్రసాద్ దొంగనోట్లు చెలామణి చేస్తున్నట్లు తేలింది. ఈ మేరకు కన్నె గంటి రామకృష్ణపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా మంగళవారం వీరాచారి, సత్యనారాయణ, శివప్రసాద్‌ను అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి రూ.500 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో మరి కొంతమంది నకిలీ నోట్లను ముద్రించి చెలామణి చేస్తున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. మరో ఫేక్ కరెన్సీ గ్యాంగ్ కూడా ఉందని.. వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు పోలీసులు.
ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో కూడా ఫేక్ కరెన్సీ ముఠా గుట్టు బయటపడింది. వీరి దగ్గరి నుంచి భారీగా నకిలీ నోట్లను పోలీసులు సీజ్ చేశారు. వారి నుంచి రూ.57.25 లక్షల నకిలీ నోట్లతోపాటు తయారీకి వినియోగించిన కలర్‌ప్రింటర్, నాలుగు సెల్‌ఫోన్లు, స్కూటీని సీజ్ చేశారు. మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు డిసెంబర్ 12వ తేదీ అర్ధరాత్రి శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం పోలీసులపై రాజమహేంద్రవరంలో దాడి చేసిన ఘటన కలకలంరేపింది. దొంగనోట్ల ముఠా సభ్యులు దాడి చేసినట్లు గుర్తించి.. మొత్తం 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు.