విజయవాడ నగరంలో గత సెప్టెంబరులో విధ్వంసం సృష్టించిన బుడమేరు వరద నియంత్రణపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. బుడమేరు ప్రక్షాళనకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పలుమార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. తాజాగా నగరంలోని ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో మంత్రులు రామానాయుడు, నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 18న మరోసారి సమీక్ష నిర్వహించి సమగ్ర నివేదికను సీఎం చంద్రబాబుకు అందజేయనున్నారు. నీటి పారుదల శాఖ, మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖల సమన్వయంతో బుడమేరు ప్రక్షాళన చేపట్టనున్నారు. భవిష్యత్తులో విజయవాడకు వరద సమస్య లేకుండా పటిష్ట చర్యలు చేపట్టనున్నట్లు మంత్రులు వెల్లడించారు. బుడమేరు, కృష్ణానదికి ఒకేసారి వరద వస్తే ఏం చేయాలన్న దానిపై కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులనూ ఇందులో భాగస్వాములను చేయనున్నారు. బుడమేరు వరద నియంత్రణ పనులకు సంబంధించి కేంద్ర నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ముందుగా సమగ్ర నివేదికను తయారు చేసి కేంద్రానికి నివేదించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో బుడమేరు విస్తరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఫిబ్రవరిలో పనులు ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.