ఓపైన్ ఏఐ వ్యవస్థాపకుడు శామ్ ఆల్ట్మన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాట్ జీపీటీని తయారు చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈయనపై.. తాజాగా ఆయన సొంత చెల్లే ఘోరమైన ఆరోపణలు చేసింది. ముఖ్యంగా తన సోదరుడు శామ్ ఆల్ట్మన్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ వివరించింది. 9 సంవత్సరాల పాటు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మరీ వందలాది సార్లు తనకు నరకం చూపించాడంటూ ఆరోపించింది. అయితే తాజాగా ఆరోపణలపై శామ్ ఆల్ట్మన్ స్పందించారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇందులో నిజమేదో వివరించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ సొంత చెల్లే.. తనపై తన అన్నయ్య లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ మిస్సోరి డిస్ట్రిక్ కోర్టును ఆశ్రయించారు. తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే తన సోదరుడు శామ్ తనపై లైంగికంగా దాడి చేయడం ప్రారంభించాడని తెలిపారు. అప్పుడు తన సోదరుడి వయసు 12 ఏళ్లు అని.. ఆరోజు నుంచి తనకు యుక్త వయసు వచ్చే వరకూ ఈ దాడులు చేశాడని వివరించారు. ముఖ్యంగా 1997 నుంచి 2006 వరకు శామ్ తనపై వందలాది సార్లు అత్యాచారం చేసినట్లు వెల్లడించారు.
రోజులు, వారాలతో సంబంధం లేకుండా.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మరీ దాడికి పాల్పడేవాడంటూ చెప్పుకొచ్చారు. ఈ దారుణమైన ఘటన వల్ల తాను తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు తెలిపారు. అయితే ఈ డిప్రెషన్ భవిష్యత్తులోనూ తనను వెంటాడుతుందని స్పష్టం చేశారు. జనవరి 6వ తేదీన ఆమె ఈ ఆరోపణలు చేయగా.. ఇప్పటి వరకు శామ్ ఆల్ట్మన్ స్పందించలేదు. దీంతో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. కానీ తాజాగా ఆయన ఈ ఘటనపై స్పందించారు. అలాగే తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.
తన సోదరి మానసిక స్థితి సరిగ్గా లేదని శామ్ ఆల్ట్మన్, ఆయన కుటుంబ సభ్యులు వివరించారు. ఆమె తీరు వల్ల కుటుంబం అంతా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. అయినా తాము ఆమెకు అండగానే ఉంటున్నట్లు వెల్లడించారు. ఆర్థికంగా కూడా పెద్ద ఎత్తున సాయం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇన్ని చేసిన ఆమె మాత్రం ఎప్పుడూ డబ్బు కావాలని తమను వేధిస్తున్నట్లు వివరించారు. అలాగే తండ్రి ఆస్తిని తన వద్దే ఉంచుకున్న సోదరి.. మరింత డబ్బుల కోసం కుటుంబ పరువును బజారుకు ఈడ్చడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు వెల్లడించారు.
అయితే ఆమె గోప్యతకు భంగం వాటిల్లకూడదనే ఉద్దేశ్యంతోనే తాము ఇన్నాళ్లూ దీనిపై స్పందించకూడదని భావించినట్లు చెప్పుకొచ్చారు. కానీ ఆమె కోర్టుకు వెళ్లింది కాబట్టి తాము దీని గురించి బయటకు చెప్పక తప్పడం లేదని తెలిపారు. అయితే ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేనందున.. తాము ఎలాంటి చర్యలూ తీసుకోలేదని.. కానీ ఇప్పుడు మాత్రం విచారణను ఎదుర్కుంటానని శామ్ ఆల్ట్మన్ స్పష్టం చేశారు. అలాగే పిచ్చి ఆరోపణలు చేస్తున్న తన సోదరి ప్రశాంతంగా ఉండేలా ఆ దేవుడు కరుణించాలని ప్రార్థన చేస్తున్నట్లు చెప్పారు.