బీజేపీ ముందు కేంద్ర ఎన్నికల సంఘం లొంగిపోయిందంటూ ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం తనదైన శైలిలో మంగళవారం తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించింది. ఢిల్లీ ఎన్నికల్లో ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ తరచూ ఆరోపణలు గుప్పిస్తున్నారని.. ఇలాంటి దురాశలకు ఎన్నికల సంఘం లొంగదని స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో ఈసీఐని ఒకే సభ్య సంస్థగా భావించి.. ఉద్దేశపూర్వకంగా ఒత్తిడి తెచ్చే వ్యూహాలను సైతం గమనించామంది.ఈ నేపథ్యంలో వివేకంతో వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలిపింది. అయితే ఎక్స్ ఖాతా వేదికగా ఈసీఐ స్పందిస్తూ.. ఎక్కడ ఆమ్ ఆద్మీ పేరు కానీ.. కేజ్రీవాల్ పేరు కానీ లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ ఎన్నికల వేళ.. రాజకీయ పార్టీలతోపాటు అభ్యర్థులు లేవనెత్తిన సమస్యలపై 1.5 లక్షల మంది అధికారులు చర్యలు తీసుకుంటున్నారని వివరించింది. వారంతా న్యాయ బద్దంగా.. ఎక్కడ పక్షపాతం లేకుండా.. స్టాండర్డ్ అపరేటింగ్ ప్రొసిజర్ ద్వారా నిపక్షపాతంగా పని చేస్తున్నారని ఈసీఐ స్పష్టం చేసింది.