నామినేటెడ్ పదవుల భర్తీ కోసం టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నెల 30న ఉగాది పర్వదినాన మూడో విడత జాబితా విడుదల చేయాలని కృతనిశ్చయంతో ఉంది. అయితే ఈ సారికి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల భర్తీకే పరిమితం కావాలని భావిస్తుండడంతో కీలకమైన కార్పొరేషన్లను ఆశిస్తున్న ఆశావహులకు నిరాశేనని చెప్పవచ్చు. అయితే మహానాడుకల్లా అన్ని నామినేటెడ్ పదవులూ భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించిన దరిమిలా రెండు నెలల్లోనే వారి ఆశలు నెరవేరే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక.. గత ఏడాది సెప్టెంబరులో నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. 20 కార్పొరేషన్ల చైర్మన్లతోపాటు మొత్తం 99 మందితో తొలి జాబితాను అప్పట్లో విడుదల చేశారు. రెండో విడత భర్తీ ప్రక్రియ నవంబరులో జరిగింది. 59 మందితో రెండో జాబితా విడుదలైంది. తొలి, రెండో విడతల్లో సుమారు 150 మంది నేతలకు న్యాయం చేశారు. మూడో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీపై నాలుగు నెలలుగా కసరత్తు జరుగుతున్నా సామాజిక సమీకరణలు.. కూటమి పార్టీల డిమాండ్ల నేపథ్యంలో ఓ కొలిక్కి రావడం లేదు. ఎట్టకేలకు ఏఎంసీ చైర్మన్లతో మూడో విడత జాబితాకు తుదిరూపు ఇస్తున్నారు. రాష్ట్రంలో 218 మార్కెట్ కమిటీలు ఉండగా ఈ విడతలో 50 నుంచి 60 స్థానాలే భర్తీ చేయనున్నారు. మిగిలినవాటిని మే నెలలో భర్తీ చేయాలనుకుంటున్నారు.
![]() |
![]() |