ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలోని విదేశీ విద్యార్థులకు షాక్.. బహిష్కరిస్తూ వందల మందికి మెయిల్స్

international |  Suryaa Desk  | Published : Sat, Mar 29, 2025, 09:48 PM

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అమెరికాలో విదేశీ విద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఏవైపు నుంచి ఏ ఉపద్రవం వచ్చిపడుతుందోనని బిక్కుబిక్కుమంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ క్రమంలో స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారులు వందల మంది విదేశీ విద్యార్థులకు మెయిల్ పంపి.. తక్షణమే అమెరికా వీడి వెళ్లాలని ఆదేశిస్తున్నారు. ఇందుకు కారణంగా క్యాంపస్‌లో కార్యకలాపాలను పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు ధ్రువీకరించారు. సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసినందుకు కొందరు భారతీయ విద్యార్థులు కూడా ఇలాంటి మెయిల్స్ అందుకునే అవకాశం ఉంది.


 ‘క్యాచ్ అండ్ రివోక్’ అనే ఏఐ టూల్ సాయంతో హమాస్ లేదా ఇతర ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా ఆందోళనలు, నిరసనల్లో పాల్గొనే విదేశీయుల వీసాలను రద్దు చేస్తున్నారు. మూడు వారాల్లో 300 మందికి పైగా విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి. మార్చి 25న అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియే జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం.. అంతర్జాతీయ విద్యార్థులు, కొత్తగా వీసాకోసం దరఖాస్తు చేసుకున్న వారి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తున్నారు. దీని ద్వారా వీసాకు అనర్హులని తేలితే వారి వీసాలను రద్దు చేస్తున్నారు.


ఇమ్మిగ్రేషన్ అటార్నీల ప్రకారం.. రుబియే ఆదేశాల ఫలితంగా అంతర్జాతీయ విద్యార్థులకు మెయిల్స్ వస్తున్నాయి. అమెరికాలోని 11 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు ఉండగా.. వీరిలో భారతీయులే 3.31 లక్షల మంది. క్యాంపస్‌లలో జరుగుతున్న ఉద్యమాలలో పాల్గొన్నందుకు అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసి, స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీచేస్తూ మెయిల్స్ పంపుతున్నారు. కేవలం క్యాంపస్‌ నిరసనల్లో పాల్గొన్నవారికే కాకుండా.. దేశానికి వ్యతిరేకంగా పెట్టిన పోస్టులను షేర్ చేసినా, లైక్ చేసినా కూడా ఇలాంటి మెయిల్స్ వస్తున్నాయని ఇమ్మిగ్రేషన్ న్యాయవాది తెలిపారు.


చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ హోదా లేకుండా అమెరికాలో ఉంటే జరిమానాలు, నిర్బంధం లేదా బహిష్కరణ తప్పదని, ఇది భవిష్యత్తులో మీరు వీసా పొందడానికి అనర్హలవుతారని మెయిల్‌లో హెచ్చరించినట్టు పలువురు విద్యార్థులు తెలిపారు. బహిష్కరణ సమయంలో మీ వస్తువులను భద్రపరుచుకోవడం, అమెరికాలో వ్యవహారాలు చక్కబెట్టుకోడానికి తగిన సమయం ఉండకపోవచ్చని, బహిష్కరణకు గురైనవారు తమ స్వదేశాలకు కాకుండా ఇతర దేశాలకు కూడా పంపుతామని పేర్కొన్నారు.


కాగా, స్టూడెంట్ వీసాలకు దరఖాస్తుచేసేవారి సోషల్ మీడియా ఖాతాలను కాన్సులేట్ అధికారులు పరిశీలించి.. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. ట్రంప్ ఇటీవల తీసుకొచ్చిన సోషల్ మీడియా పాలసీలో భాగంగానే అంతర్జాతీయ విద్యార్థులు, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తున్నారని నిపుణులు పేర్కొన్నారు.


కాగా, రెండు రోజుల కిందట రుబియో మీడియాతో మాట్లాడుతూ.. టఫ్ట్స్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థిని నిర్బంధం గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ. ‘అమెరికాకు రావడానికి వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేయడం, విద్యార్థులను వేధించడం, భవనాలను స్వాధీనం చేసుకోవడం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడానికి వస్తున్నామని చెబితే మేం వీసా ఇవ్వం... మీరు అబద్ధాలతో మోసపూరితంగా వీసా పొంది అమెరికాలో ప్రవేశించి.. అలాంటి కార్యకలాపాలలో పాల్గొంటే కచ్చితంగా రద్దు చేస్తాం’ అన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com