ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్ కొత్త పాలసీ.. భారతీయ గ్రీన్ కార్డుదారులకు ఇక చుక్కలే!

international |  Suryaa Desk  | Published : Tue, Mar 25, 2025, 07:14 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసలను అరికట్టేందుకు కఠిన చర్యలను అవలంభిస్తున్నారు. ఈ క్రమంలో అక్రమ వలసదారులను గుర్తించి, వారిని వెనక్కిపంపుతున్నారు. వలసలను అరికట్టే చర్యల్లో భాగంగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో నివసిస్తున్న గ్రీన్ కార్డ్ హోల్డర్ల సోషల్ మీడియా ఖాతాల వివరాలను ప్రభుత్వానికి అప్పగించాలని ప్రతిపాదించారు. ఇప్పటికే వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారు తమ సోషల్ మీడియా వివరాలను అమెరికా సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తో పంచుకుంటున్నారు. ఇప్పుడు ఈ విధానాన్ని అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తున్న వారికి కూడా వర్తింపజేయనున్నారు.


శాశ్వత నివాసం కోసం లేదా శరణార్ధిగా దరఖాస్తు చేసుకునే వారు కూడా తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చర్య ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేసేవారిని అమెరికాలో స్థిరపడకుండా అడ్డుకునే అవకాశం ఉంది. అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తున్న చాలా మంది భారతీయులపై ఇది ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొనే భారతీయ అమెరికన్లపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది.. ప్రభుత్వ పర్యవేక్షణ ఎక్కువ కావడం వల్ల రాజకీయ విషయాలపై మాట్లాడేందుకు వెనుకాడతారు.


మార్చి 5న ఈ ప్రతిపాదనలు విడుదల చేసిన ట్రంప్ యంత్రాంగం.. ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తోందది. గుర్తింపు, ధ్రువీకరణ, జాతీయ భద్రత, ప్రజల భద్రత కోసం దరఖాస్తుదారుల సోషల్ మీడియా వివరాలను సేకరించాల్సిన అవసరం ఉందని యూఎస్సీఐఎస్ తెలిపింది. సోషల్ మీడియా ఖాతాల ద్వారా వ్యక్తుల గుర్తింపును ధ్రువీకరించడం, వారి గురించి పూర్తిగా తెలుసుకుని.. జాతీయ భద్రతను రక్షించడం సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.


ప్రస్తుతం వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు మాత్రమే తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త ప్రతిపాదన ప్రకారం గ్రీన్ కార్డ్ ఉన్నవారు, ఆశ్రయం కోరుకునేవారు కూడా తమ సోషల్ మీడియా వివరాలను ప్రభుత్వానికి అందించాలి. వలసలపై కఠినంగా వ్యవహరిస్తోన్న ట్రంప్ ప్రభుత్వం.. గ్రీన్ కార్డ్, వీసా ఉన్న వారిపై కూడా నిఘా పెంచింది. వలసదారులను వెనక్కి పంపే కార్యక్రమాన్ని అధ్యక్షుడు ట్రంప్ ముమ్మరం చేశారు. అయితే, ఇది అమెరికాలో రాజకీయ విమర్శలకు దారితీసింది.


ట్రంప్ ప్రభుత్వం మార్చి 5న విడుదల చేసిన నోటీసులో ‘గుర్తింపు ధృవీకరణ, పరిశీలన, జాతీయ భద్రత, ప్రజల భద్రత కోసం దరఖాస్తుదారుల నుంచి సోషల్ మీడియా వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది.. దీని అర్థం ఏంటంటే.. ప్రభుత్వం మీ సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించి, మీరు దేశానికి సురక్షితమైన వ్యక్తి అవునో కాదో నిర్ణయిస్తుంది’ అని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com