తిరుమల పవిత్రత కూటమి ప్రభుత్వంలో మంటగలుస్తోందని మాజీ టీటీడీ బోర్డ్ చైర్మన్, వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పదినెలల కూటమి పాలనలో తిరుమలలో జరుగుతున్న అనాచారాలు శ్రీవారి భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి కంకణం కట్టుకున్నానన్న పవన్ కళ్యాణ్ ఈ దుర్మార్గాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అయన మాట్లాడుతూ.... వైయస్సార్సీపీ అధికారంలో ఉండగా చిన్న అంశాలను కూడా భూతద్దంలో చూపించి తిరుమల పవిత్రతను మంట కలిపేశారని చిలువలువలవులుగా ప్రచారం చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు.. అధికారంలోకి వచ్చాక ఇదే తిరుమల కేంద్రంగా వరుసగా అపశృతులు జరుగుతున్నా తమకు సంబంధం లేదన్నట్టే వ్యవహరిస్తున్నారు. పది నెలల పాలనతో తిరుమలను ఏకంగా గంజాయి కేంద్రంగా మార్చేశారు. మద్యం అమ్మకాలు కూడా విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అత్యంత పవిత్రమైన పాపవినాశనం జలాశయంలో బోటు షికారు చేయడంపై అధికారులు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. పైగా అధికారులు పాపవినాశనంలో బోటు షికారు చేసిన వీడియోలను సరదాగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని ఆనందం పొందుతున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న కారణంతో కూంబింగ్ కోసం పాపవినాశనం జలాశయంలో బోట్లను దించడం జరిగిందని వివేక్ అనే అటవీశాఖాధికారి ప్రకటించాడు. ఈ విషయం పత్రికల్లో ప్రచురితం అయ్యింది. ఇది జరిగి ఐదు రోజులైనా ఏరకమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయో ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. దీనిపై ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ, ఏఈవో కానీ ఇంతవరకు స్పందించలేదు. అంటే, చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రభుత్వమే అంగీకరించినట్టు అనుకోవాల్సి వస్తుంది. వివేక్ మీద ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంకోపక్క టూరిజం కోసం ట్రయల్ రన్ చేస్తున్నామని అటవీ సిబ్బంది ప్రకటించిన విషయం కూడా అవే పత్రికల్లో వచ్చింది. పవిత్ర జలాశయాన్ని టూరిస్ట్ కేంద్రంగా మార్చాలనే దురాలోచన చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అని అన్నారు.
![]() |
![]() |