తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహార శైలిపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కారణంగా తలెత్తుతున్న వివాదాలపై ఆయన పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. తిరువూరులో నెలకొన్న పరిస్థితులను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని, జిల్లా అధ్యక్షుడు రఘురాం ముఖ్యమంత్రికి వివరించారు. కొలికిపూడికి సంబంధించి తరచూ వివాదాలు తలెత్తుతుండడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల్లో లేని సమస్యలు తిరువూరులోనే ఎందుకు వస్తున్నాయని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం.ఈ వివాదంపై సమగ్ర సమాచారం సేకరించి, కార్యకర్తలతో మాట్లాడిన అనంతరం చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. పార్టీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే ఎవరైనా పనిచేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు.శనివారం తిరువూరు టీడీపీ కార్యకర్తలు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. "కొలికపూడి డౌన్ డౌన్", "తిరువూరుకు కొలికపూడి వద్దు" అంటూ నినాదాలు చేశారు.రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కార్యకర్తలను శాంతింపజేసి, తిరువూరు ముఖ్య నేతలతో మాట్లాడారు. పార్టీయే అత్యున్నతమని, పార్టీ నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యకర్తల అభిప్రాయాలను పార్టీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేశ్ ల దృష్టికి తీసుకెళతానని పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.
![]() |
![]() |