ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంకలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన 1996 వన్డే వరల్డ్ కప్ నెగ్గిన శ్రీలంక క్రికెట్ టీమ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితో కలిసి కబుర్లు చెప్పుకున్నారు. సనత్ జయసూర్య, రమేశ్ కలువితరణ, అరవింద డిసిల్వా, రోషన్ మహానామా, చామిందా వాస్, కుమార్ ధర్మసేన, హషన్ తిలకరత్నే తదితరులు మోదీతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాటి క్రికెట్ జట్టు తరఫున వారు మోదీకి ఓ జ్ఞాపికను బహూకరించారు. దీనికి సంబంధించిన వీడియోను మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 1996 వరల్డ్ కప్ గెలిచిన శ్రీలంక టీమ్ సభ్యులతో సంభాషణ అద్భుతంగా సాగిందని వెల్లడించారు. అంతర్జాతీయ క్రికెట్లో చాలాకాలం పాటు పసికూనగా ఉన్న శ్రీలంక జట్టు 1996లో వరల్డ్ కప్ గెలిచి క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఆ వరల్డ్ కప్ కు ముందు ఆస్ట్రేలియాలో పర్యటించిన శ్రీలంక జట్టు... ఓ ఘటన కారణంగా కసితో రగిలిపోయింది. దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ త్రో అంటూ ఓ అంపైర్ అదేపనిగా నోబాల్స్ ఇస్తుండడంతో అప్పటి కెప్టెన్ అర్జున రణతుంగ తన జట్టును తీసుకుని మైదానాన్ని వీడాడు. ఆ ఘటన శ్రీలంక జట్టు గతిని మార్చివేస్తుందని ఆ క్షణాన ఎవరూ ఊహించి ఉండరు. ఆ అవమానం వారిలో విజయకాంక్షను రగిల్చింది. జన్మతః శ్రీలంక జాతీయుడై, ఆ తర్వాత కాలంలో ఆస్ట్రేలియా తరఫున క్రికెట్ ఆడిన డేవిడ్ వాట్ మోర్ శ్రీలంక జట్టుకు కోచ్ గా రావడం... ఇండియా, పాకిస్థాన్ లతో కలిసి 1996లో తాను కూడా ఆతిథ్యమిచ్చిన వరల్డ్ కప్ ను శ్రీలంక గెలుచుకోవడం ఓ చరిత్ర. అది కూడా ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించడంతో శ్రీలంక జట్టుకు ఆ వరల్డ్ కప్ విజయం చిరస్మరణీయంగా నిలిచిపోయింది.
![]() |
![]() |