నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన ఈ సినిమా, తాజాగా అంతర్జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకర్షించింది. ఇరాక్‌కు చెందిన ఓ ప్రముఖ అరబిక్ వార్తాపత్రిక ఈ సినిమాపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ వార్త తెలియడంతో బాలకృష్ణ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.సంబంధిత అరబిక్ పత్రిక కథనం ప్రకారం, ‘డాకు మహారాజ్’ చిత్రంలో వినియోగించిన సాంకేతికత, చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయని ప్రశంసలు లభించాయి. కథానాయకుడి పాత్రను అత్యంత శక్తిమంతంగా తీర్చిదిద్దారని, పేదల పాలిట అండగా నిలిచే రాబిన్‌హుడ్ తరహాలో ఈ పాత్ర ఉందని ఆ కథనంలో విశ్లేషించారు. సినిమా కథాంశం, సాధించిన వసూళ్ల వివరాలను కూడా సదరు పత్రిక తమ కథనంలో పేర్కొంది. సాధారణంగా తెలుగు సినిమా విశేషాలు అరబిక్ పత్రికల్లో చోటుచేసుకోవడం అరుదు కావడంతో, ఈ పరిణామం పట్ల బాలయ్య అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇరాక్ పత్రికలో వచ్చిన కథనానికి సంబంధించిన చిత్రాన్ని వారు ‘ఎక్స్’ వేదికగా పంచుకుంటున్నారు.బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. ఊర్వశీ రౌతేలా ఓ ప్రత్యేక గీతంలో మెరవగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా, ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లోనూ విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. విడుదలైన తర్వాత చాలా రోజుల పాటు ఓటీటీ ట్రెండింగ్‌లో కొనసాగింది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
![]() |
![]() |